పార్లమెంటులో బీసీ ప్రైవేట్ బిల్లు పెట్టాలి
బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ చిత్తశుద్ధి నిరూపించుకోవాలి
రాహుల్ గాంధీకి బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ బహిరంగలేఖ
హైదరాబాద్, మార్చి 1(విజయక్రాంతి): కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం బీసీలకు విద్యా ఉద్యోగ రాజకీయ రంగాల్లో 42 శాతం రిజర్వేషన్లు పెంచు తూ రాష్ట్ర అసెంబ్లీలో చేసిన చట్టాన్ని పార్లమెంటులో ఆమోదించేలా బీసీ రిజర్వేషన్ల ప్రైవేట్ బిల్లును కాంగ్రెస్ ప్రవేశ పెట్టి, తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్‌గౌడ్ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని డిమాండ్ చేశారు.
రేపు రాష్ట్ర పర్యటనకు విచ్చేస్తున్న సందర్భంగా ఆయనకు బీసీ డిమాండ్లపై శ్రీనివాస్‌గౌడ్ బహిరంగ లేఖ రాశారు. దేశవ్యాప్తంగా కులగణన జరిగి, జనాభా దామాషా ప్రకారం ఎవరి వాటా వారికి చట్టబద్ధంగా దక్కాలన్న రాహుల్ గాంధీ ఆ నినాదాన్ని ఆచరణలో చూపించి, తెలంగాణ రాష్ట్రాన్ని సామాజిక న్యాయానికి ఒక మోడల్‌గా చేయాలని ఆయన కోరా రు. అతిత్వరలో భర్తీ చేసే రెండు రాజ్యసభ స్థానాలలో ఒకటి బీసీకి, రెండోది ఎస్సీ, ఎస్టీలకు కేటాయిం చాలని ఆయన డిమాండ్ చేశారు.
నామినేటెడ్ పోస్టుల్లో, ప్రభుత్వ కాంట్రాక్టులలో, రాష్ట్ర బడ్జెట్‌లో, అన్ని స్థాయిలోనూ తెలంగాణలో జరిగిన కులగణన ఆధారంగా బీసీలకు జనాభా దామాషా ప్రకారం అవకాశాలు కల్పించాలని కోరారు. ఫీజులు బకాయిలను విడుదల చేయాలని, కుమ్మెర ఘటనలో నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర జనాభాలో అత్యధిక జనాభా ఉన్న బీసీల ఆకాంక్షలను గౌరవించకపోతే, బీసీలకు కామారెడ్డి డిక్లరేషన్ ద్వారా ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా తగ్గదని హెచ్చరించారు.




