calender_icon.png 13 November, 2025 | 4:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీసీ రిజర్వేషన్లు 42 శాతానికి పెంచాలి

20-05-2024 12:19:47 AM

ఆ తరువాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి

ఎంపీ, బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య

హైదరాబాద్ సిటీబ్యూరో, మే 19 (విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన మాట ప్రకారం బీసీ రిజర్వేషన్లు 20 శాతం నుంచి 42 శాతానికి పెంచిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ఎంపీ, బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్‌చేశారు. ఆదివారం హైదరాబాద్ బీసీ భవన్‌లో సీ రాజేందర్, రాష్ట్ర ఐఖ్య వేదిక అధ్యక్షుడు అనంతయ్య ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు కులగణన చేపడతామని చెబుతూనే, మరోవైపు జూన్‌లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పడం ఏమిటని ప్రశ్నించారు. మొదట కులగణన చేపట్టి రిజర్వేషన్లు పెంచాలని, ఆ తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్‌చేశారు. కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ దేశవ్యాప్తంగా బహిరంగ సభల్లో కులగణన జరుపుతామని, దాని ప్రకారమే విద్యా, ఉద్యోగ, రాజకీయ రిజర్వేషన్లు పెంచుతామని, బడ్జెట్ కేటాయిస్తామని బీసీ ఎజెండా ఎత్తుకుంటే, ఇక్కడ మాత్రం బీసీలకు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు.

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 55 శాతం ప్రాతినిధ్యం కల్పించారని గుర్తుచేశారు. పలువురు నేతలు మాట్లాడుతూ.. రిజర్వేషన్ల విషయంలో ప్రభుత్వం  వెంటనే తగు చర్యలు తీసుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా గ్రామస్థాయిలో ఉద్యమిస్తామని హెచ్చరించారు. సమావేశంలో బీసీ సంఘాల నేతలు రాజేందర్ ముదిరాజ్, కృష్ణమూర్తి యాదవ్, అనంతయ్య కురుమ, నరసింహగౌడ్ తదితరులు పాల్గొన్నారు.