20-05-2024 12:18:30 AM
40 శాతం ఫిట్‌మెంట్‌తో అమలు చేయాలి
ఎస్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సదానందంగౌడ్
హైదరాబాద్, మే 19 (విజయక్రాంతి): ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే రెండో పీఆర్సీ అమలు చేయాలని, 40 శాతం ఫిట్‌మెంట్‌తో దాన్ని ప్రకటించాలని స్టేట్ టీచర్స్ యూనియన్ (ఎస్టీయూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీ సదానందంగౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్‌చేశారు. హైదరాబాద్ కాచిగూడలోని ఎస్టీయూ భవన్‌లో రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు బీ రవి అధ్యక్షతన నిర్వహించిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
ఎస్జీటీ ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపునిస్తూ హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చిన నేపథ్యంలో బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌చేశారు ప్రభుత్వ పంచాయతీరాజ్ ఉపాధ్యాయులకు ఉమ్మడి సర్వీస్ నిబంధనలు లేక, పర్యవేక్షణాధికారి పోస్టులు భర్తీకాక విద్యాశాఖలో అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పారు.
ఉపాధ్యాయ, ఉద్యోగులకు శాపంగా మారిన 317 జీవోపై ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకొని, బాధిత ఉపాధ్యాయులను ఆదుకోవాలని సదానందంగౌడ్ కోరారు. ఇప్పటికే నాలుగు డీఏలు పెండింగ్‌లో ఉన్నాయని, కనీసం రెండు డీఏలు వెంటనే విడుదల చేయాలని విజ్ఞప్తిచేశారు. వచ్చే విద్యాసంవత్సరంలో పాఠశాల పారిశుద్ధ్య కార్మికులను నియమించాలని కోరారు. అన్ని రకాల గురుకుల, ఆశ్రమ, మోడల్ స్కూళ్లలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు ట్రెజరీల ద్వారా వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు.