బీసీ రిజర్వేషన్లకు రాజ్యాంగ బద్ధత కల్పించాలి
బీసీ జేఏసీ జిల్లా కో-ఆర్డినేటర్ వడ్డేపల్లి మనోహర్
మందమర్రి,(విజయక్రాంతి): బిసి రిజర్వేషన్లకు చట్ట బద్దత కల్పించి స్థానిక సంస్థల ఎన్ని కల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని బీసీ జేఏసీ జిల్లా కో-ఆర్డినేటర్ ఒడ్డేపల్లి మనోహర్ డిమాండ్ చేశారు. బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీసీ జేఏసీ ఆధ్వర్యంలో శుక్రవారం మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... బిసి రిజర్వేషన్లు అమలు చేయకుండా స్థానిక ఎన్నికలకు వెళితే కాంగ్రెస్ పార్టీని బీసీ ప్రజలు నమ్మరని, బీసీ రిజర్వేషన్లకు రాజ్యాంగ బద్ధత కల్పించేందుకు డిసెంబర్ 1 నుండి జరుగ నున్న పార్లమెంట్ సమావేశాల్లో రాజ్యాంగంను సవరించాలని ఇందు కోసం ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తక్షణమే అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకు వెళ్లాలన్నారు.
కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చి పార్లమెంట్ లో బీసీ బిల్లుపై చర్చ చేపట్టీ రాజ్యాంగ సవరణ ద్వారా బీసీ రిజర్వేషన్ల చట్టానికి ఆమోదం తెలపాలని, లేని పక్షంలో డిసెంబర్ మొదటి వారంలో వేలాది మందితో పార్లమెంటును దిగ్బందిస్తా మని ఆయన స్పష్టం చేశారు. బీసీలకు 42% రిజర్వేషన్లు సాధించేవరకు ఉద్యమాన్ని ఆపే ప్రసక్తే లేదనీ, తెలంగాణ ఉద్యమం, ఢిల్లీ రైతు ఉద్యమాల తరహ లో బీసీలు ఉద్యమించి విజయం సాధించాలని కోరారు.




