3 September, 2026 | 5:22 AM

నేడు బీసీసీఐ రివ్యూ మీటింగ్

03-09-2026 | 02:30am
  1. గంభీర్, అగార్కర్‌లకు పిలుపు
  2. ఐర్లాండ్, ఇంగ్లాండ్ టూర్ వైఫల్యాలపై సమీక్ష 
  3. ఆటగాళ్ళ గాయాలపైనా చర్చించనున్న బోర్డు
  4. తేలిపోనున్న రోహిత్ శర్మ భవితవ్యం 

* ఇటీవల ఐర్లాండ్, ఇంగ్లాండ్ టూర్లలో భారత జట్టు పేలవ ప్రదర్శనపై బీసీసీఐ సమీక్షా సమావేశం నిర్వహించబోతోంది. దీని కోసం హెడ్ కోచ్ గౌతం గంభీర్, చీఫ్ సెలెక్టర్ అగార్కర్‌లను ముంబై హెడ్ క్వార్టర్స్‌కు పిలిచింది. ఇదే మీటింగ్‌లో ఆటగాళ్ల గాయాలు, ఫిట్‌నెస్ సమస్యలతో పాటు రోహిత్ శర్మ భవితవ్యంపై చర్చ జరగనుంది.

ముంబై , సెప్టెంబర్ 2 : టీ ట్వంటీ ఫార్మాట్‌(T20 format,)లో వరల్డ్ చాంపియన్‌(World Champion)గా ఉన్న టీమిండియా(Team India) ఇటీవల పసికూన ఐర్లాండ్(Ireland) చేతిలో సిరీ స్ కోల్పోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆ తర్వాత ఇంగ్లాండ్‌లోనూ 0-4తో ఘోర పరాభావం కూడా షాక్‌కు గురి చేసింది. అదే టూర్‌లో వన్డే సిరీస్‌ను సైతం కోల్పోయింది. ఈ వరుస పరాజయాలపై బీసీసీఐ రివ్యూ మీటింగ్(BCCI review meeting) నిర్వహించబోతోంది. దీని కోసం హెడ్ కోచ్ గౌతం గంభీర్(Gautam Gambhir), చీఫ్ సెలెక్టర్ అగార్కర్‌(Agarkar)తో గురువారం సమావేశం కాబోతోంది.

బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సై కియా అధ్యక్షతన జరిగే ఈ ఉన్నత స్థాయి సమావేశానికి హాజరు కావాల్సిందిగా ఇప్పటికే  గంభీర్, అగార్కర్‌తో పాటు, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్  హెడ్ వీవీఎస్ లక్ష్మణ్‌లను బోర్డు ఆదేశించింది. ఇంగ్లండ్, ఐర్లాండ్ పర్యటన వైఫల్యంతో పాటు ఆటగాళ్లు తరుచు గా యాల బారిన పడటం, భవిష్యత్తు సిరీస్‌లకు అనుసరించాల్సిన వ్యూహాలపై బీసీసీఐ పెద్దలతో టీం మేనేజ్‌మెంట్ చర్చించనుంది.

జూన్, జూలై నెలల్లో జరిగిన ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనల్లో భారత జట్టు(Indian team) పేలవ ప్రదర్శనపై ప్రధానంగా సమీక్షించనున్నారు. ఐర్లాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌ను 2-0తో కోల్పోవడం, ఇంగ్లండ్ పర్యటనలో టీ20 సిరీస్ను 4-0తో మరియు వన్డే సిరీస్‌ను 2-1తో చేజార్చుకోవడంపై బోర్డు సుదీర్ఘంగా చర్చించనుంది. సీని యర్ ప్లేయర్స్‌తో కూడిన జట్టును పంపినా ఈ ఫలితాలు బోర్డుకు మింగుడు పడడం లేదు. దీనిపై గంభీర్‌ను వివరణ కోరనుంది.

ముఖ్యంగా ఆటగాళ్లు తరుచూ గాయపడటం వల్ల కీలక పర్యటనలకు సరైన కాంబినేషన్ బరిలోకి దించలేకపోవడం ప్రధాన చర్చనీయాంశం కానుంది. శ్రీలంక పర్యటనకు జ ట్టును ఎంపిక చేయడానికి కొద్ది రోజుల ముందు.. జస్ప్రీత్ బుమ్రా ఫిట్‌గా లేడన్న విషయం చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్‌కు కూడా తెలియదు. ఆయన ఈ విషయంపై సీ ఓఈకి ఒక ఇమెయిల్ కూడా పంపారు. ఈ విషయంపై లక్ష్మణ్‌ను బీసీసీఐ పెద్దలు వివరణ కోరే అవకాశం ఉంది.

అలాగే న్యూజి లాండ్ పర్యటనకు ఆరుగురు భారత పేసర్ల ను తీసుకోవాలని టీం మేనేజ్‌మెంట్ భావిస్తోంది. మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, గుర్నూర్ బ్రార్, జస్ప్రీత్ బుమ్రా, ఆకాష్ దీప్ వంటి ఆటగాళ్ల పేర్లపై చర్చ జరగనుంది. ఈ బౌలర్లు అందుబాటులో ఉన్నారా?, ఫిట్నెస్ సమస్యలు ఏమైనా ఉన్నాయా? అనే విషయాలను కూడా సమావేశంలో చర్చించే అవకాశం ఉంది.

ఇక సీనియర్ ఆటగాడు రోహిత్ శర్మ భవిష్యత్తు మరియు జట్టులో అతని పాత్రపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మరోవైపు చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపునకు సంబంధించి సెప్టెంబర్ 18న జరిగే బీసీసీఐ వార్షిక సర్వసభ్య సమావేశంలో తుది నిర్ణ యం తీసుకోనున్నారు.