08-02-2026 01:12:48 AM
ముంబై, ఫిబ్రవరి 7: అండర్ 19 క్రికెట్‌లో తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ ఆరోసారి వరల్డ్‌కప్ గెలిచిన భారత యువ జట్టు పై ప్రశంసల జల్లు కురుస్తోంది. ఆయుశ్ మాత్రే సారథ్యంలోని భారత్ అండర్ 19 జట్టు ఫైనల్లో 100 పరుగుల తేడాతో ఇం గ్లాండ్‌ను చిత్తు చేసింది. వైభవ్ సూర్యవంశీ 175 పరుగులతో విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడి టైటిల్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. అద్వితీయమైన విజయం సాధించిన యువ భారత జట్టుకు బీసీసీఐ భారీ నజరానా ప్రకటించింది.
యువ చాంపియన్లకు రూ.7.5 కోట్ల నగదు బహుమతి అందజేయనున్నట్టు బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా చెప్పారు. అండర్ 19 ప్రపంచకప్ ఫైనల్లో యువ క్రికెటర్ల ప్రదర్శన దేశం గర్వించేవిధంగా ఉందని కితాబిచ్చారు. ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా ట్రోఫీ గెలవడం అద్భుతమన్నారు. త్వరలోనే యువ క్రికెటర్లను సత్కరించిన నజరానా అందజేస్తామని తెలిపారు. కాగా అండర్ 19 ప్రపంచకప్ గెలిచినా ఐసీసీ ఎలాంటి ప్రైజ్‌మనీ ఇవ్వదు. ఎందుకంటే ఈ టోర్నమెంట్‌ను ఐసీసీ అభివృద్ధి కార్యక్రమంగా మాత్రమే పరిగణిస్తుంది.
యువ క్రికెటర్లకు అంతర్జాతీయ స్థాయికి చేరుకునేలా అనుభవం కలిగేందుకు, వారి నైపు ణ్యాలను వెలికితీసే వేదికగా అండర్ 19 ప్రపంచకప్‌ను నిర్వహిస్తుంది. అందుకే ఈ టోర్నీలో పాల్గొనే ఏ జట్టుకూ కూడా ఎలాం టి ప్రైజ్‌మనీ లభించదు. అయితే ఇప్పటికే అన్ని దేశాల క్రికెట్ బోర్డులకు యువక్రికెటర్ల ట్రైనింగ్ కోసం ఐసీసీ తన రెవెన్యూ నుంచి కొంత మొత్తాన్ని ఫండ్స్ రూపంలో అందజేస్తుంది. ఆ నిధులను యువ ఆటగాళ్ల ట్రైనిం గ్, టోర్నీల కోసం ఆయా బోర్డులు వెచ్చించాల్సి ఉంటుంది.