6 June, 2026 | 1:46 AM

తెలంగాణ, ఆంధ్రలో బీసీలకు సామాజిక న్యాయం దక్కడం లేదు

06-06-2026 12:00 AM

జాజుల శ్రీనివాస్ గౌడ్ 

ఖైరతాబాద్, జూన్ 5 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా బీసీలకు ఆశించిన స్థాయిలో న్యాయం జరగలేదని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన అనంతరం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అగ్రకులాల ఆధిపత్యమే కొనసాగుతోందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజు ల శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు.ఆంధ్రతెలంగాణ భావోద్వేగాల పేరుతో బహుజన వర్గా లను మోసం చేసే రాజకీయాలను ప్రజలు గుర్తించాలని ఆయన పిలుపునిచ్చారు.

సోమాజిగూడ ప్రెస్‌క్లబ్లో బీసీ కుల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మా ట్లాడారు. సమావేశానికి బీసీ జేఏసీ చైర్మన్ కుందారం గణేష్ చారి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ రాజకీయ విశ్లేషణ చేసినందుకు ప్రొఫెసర్ నాగేశ్వర్ రావుపై నమోదైన కేసులను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.

అలాగే తెలంగాణకు సం బంధించి చేసిన వ్యాఖ్యలపై పవన్ కళ్యాణ్ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని కోరారు.తెలంగాణ రాష్ట్ర సాధనలో బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల పాత్ర కీలకమని పేర్కొన్న ఆయన,ఉద్యమంలో త్యాగాలు చేసిన బహుజన వర్గాలకు రాష్ట్ర ఏర్పాటుతో తగిన ప్రాతినిధ్యం లభించలేదన్నారు. ఉమ్మడి రాష్ట్రంతో పోలిస్తే తెలంగాణలో బీసీ ఎమ్మెల్యేలు, మంత్రుల సంఖ్య తగ్గిందని, కీలక పదవులు ఇప్పటికీ అగ్రకులాలకే పరిమితమవుతున్నాయని విమర్శించారు.

స్థానిక సంస్థ ల్లో బీసీ రిజర్వేషన్లు తగ్గించడం, ఫీజు రీయింబర్స్మెంట్ వంటి సంక్షేమ పథకాల అమలులో పరిమితులు విధించడం, బీసీ సబ్ప్లా న్ ఏర్పాటు చేయకపోవడం వంటి అంశాలను ఆయన ప్రస్తావించారు. బీసీ కార్పొరే షన్లకు తగిన నిధులు కేటాయించడం లేదని, సంప్రదాయ వృత్తుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఆరోపించారు.

భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రా ల్లో బీసీ ముఖ్యమంత్రుల సాధనే లక్ష్యంగా ఉద్యమాన్ని కొనసాగిస్తామని జాజుల శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలు ఐక్యంగా ముందుకు వచ్చి రాజకీయ అధికారాన్ని సాధించాల్సిన అవసరం ఉందన్నారు.సమావేశంలో బీసీ జేఏసీ నాయకులు గుజ్జ కృష్ణ, కుల్కచర్ల శ్రీనివాస్ ముదిరాజ్, తాటికొండ విక్రమ్ గౌడ్, ఉప్పరి శేఖర్ సాగర్, స్వర్ణ గౌడ్ పాల్గొన్నారు.