6 June, 2026 | 1:44 AM

జాతీయ విద్యా విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం తిరస్కరించాలి

06-06-2026 12:00 AM

ప్రొఫెసర్ హరగోపాల్

ముషీరాబాద్, జూన్ 5 (విజయక్రాంతి): కేంద్ర ప్రభుత్వం తన బడ్జెట్లో 10% రాష్ట్ర బడ్జెట్లో కనీసం 20% నిధులు విద్యాకు కేటాయించాలని, జాతీయ విద్యా విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం తిరస్కరించాలని తెలంగాణ విద్యా పరిరక్షణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రొఫెసర్ హరగోపాల్ అన్నారు. ఈ మేరకు హైదరాబాద్ ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద శుక్రవారం తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో విద్యా ప్రవేటీకరణ, కార్పొరేటీకరణకు వ్యతిరేకంగా విద్యా పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించారు.

ఈ ధర్నాకు ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం, తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ అధ్యక్షులు ప్రొఫెసర్ కె. చక్రధర్ రావు, కార్యనిర్వాహక కార్యదర్శి ప్రొఫెసర్ కె. లక్ష్మీనారాయణ, ప్రధాన కార్యదర్శి ప్రొఫెసర్ జి. హరగోపాల్, టిపిటి ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్. తిరుపతి పలువురు నాయకులు హాజరై మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ హరగోపాల్ మాట్లాడుతూ రాజ్యాంగంలోని ఆర్టికల్ ఏ 21 ప్రకారం ఉచిత నిర్బంధ విద్య అనేది ప్రతి బిడ్డకు ప్రాథమిక హక్కు అని గుర్తు చేశారు.

ఈ హక్కును కాపాడాల్సిన రాజ్యాంగమే (ప్రభుత్వమే) నేడు విద్యను అంగట్లో సరుకుగా మార్చి కార్పొరేట్ శక్తులకు కట్టబెడుతుందని మండిపడ్డారు. జాతీయ విద్యా విధానం ఎన్‌ఈపి ద్వారా విద్యా వ్యవస్థను మతీకరణ, కేంద్రీ కరణ చేస్తున్నారని,  ఎన్టిఏ వంటి సంస్థల వైఫల్యం వల్ల నీట్ పరీక్ష రాసిన 21 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు బుగ్గిపాలైందని ఆవేదన వ్యక్తం చేశారు. సంక్షేమ రాజ్యాంగా ఉండాల్సిన ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీలా మారడం రాజ్యాంగ విరుద్ధమని హెచ్చరించారు.

అనంతరం చక్రధర్ రావు, సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర నాయకులు జె. చలపతి రావు, టిపిటిఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్. తిరుపతి పలువురు నాయకులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా ఫోరమ్ ఫర్ రైట్ టు ఎడ్యుకేషన్ టిపిటి ఎఫ్, డిటిఎఫ్, టీఎస్‌ఈసి, పిడిఎస్ యు, న్యూ డెమోక్రసీ, పిడిఎస్ యు మాస్ లైన్, పిడిఎస్ యు విజృంభన, ఇతర విద్యారంగా సంఘాల నాయకులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.