రాజ్యాంగ సవరణతోనే బీసీలకు రక్షణ
- బంద్ సెగ ఢిల్లీకి తాకాలి
ఇది ఆరంభం మాత్రమే..
సీఎం రేవంత్ రెడ్డి తప్పిదాల వల్లే కోర్టుల్లో ఎదురుదెబ్బ
బీసీ జేఏసీ నేతలు ఆర్. కృష్ణయ్య, జాజుల శ్రీనివాస్ గౌడ్, రాజారాం యాదవ్
హైదరాబాద్,సిటీ బ్యూరో అక్టోబర్ 16 (విజయక్రాంతి ): స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% బీసీ రిజర్వేషన్ల సాధనకు శనివారం తలపెట్టిన రాష్ర్ట బంద్ సెగ ఢిల్లీకి తాకాలి. ఇది బీసీల ఐక్యతను, ఆగ్రహాన్ని కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలకు తెలియజేయాలి, అని బీసీ జేఏసీ చైర్మన్, ఎంపీ ఆర్. కృష్ణయ్య పిలుపునిచ్చారు. గురువారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో బీసీ జర్నలిస్టుల అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీసీ జేఏసీ నేతలు మాట్లాడారు.
ఈ సందర్భంగా ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ బీసీలంతా రాజకీయాలకు అతీతంగా ఏకమై బంద్‌ను విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. జేఏసీ వర్కింగ్ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడు తూ,ఈ రాష్ర్ట బంద్ ముగింపు కాదు, బీసీల హక్కుల సాధన పోరాటానికి ఇది ఆరంభం మాత్రమే అని హెచ్చరించారు. జేఏసీ కో-చైర్మన్ డి. రాజారాం యాదవ్ మాట్లాడుతూ, హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు స్టే ఇవ్వకపోవడానికి సీఎం రేవంత్ రెడ్డి అనుసరించిన విధానాలే కారణమని, దీనికి ఆయనే పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.
రాజ్యాంగ సవరణే శ్రీరామరక్ష..
ఎస్సీ, ఎస్టీలకు కల్పించినట్లే, జనాభా ప్రాతిపదికన రాజ్యాంగ సవరణ ద్వారా బీసీ రిజర్వేషన్లకు రక్షణ కల్పించాలి. మాజీ సీఎం కేసీఆర్ చెప్పినట్లు రిజర్వేషన్ల అమలును రాష్ట్రాలకే అప్పగించాలి. అప్పుడే బీసీలకు న్యాయం జరుగుతుందని రాజారాం యాద వ్ డిమాండ్ చేశారు. హైకోర్టు స్టేను సుప్రీంకోర్టు ఎత్తివేయడానికి నిరాకరించడం, బీసీల పట్ల వ్యవస్థలు ఎంత వ్యతిరేకంగా ఉన్నా యో చెప్పడానికి నిదర్శనమని జేఏసీ వైస్ చైర్మన్ వీజీఆర్ నారగోని అన్నారు.






