15 April, 2026 | 9:51 AM

42 శాతం రిజర్వేషను కల్పించాకే ఎన్నికలకు వెళ్లాలి

17-10-2025 01:26 AM
  1. తెలంగాణ భవన్ నుంచి వెళ్లి బీసీ బంద్‌లో పాల్గొంటాం
  2. సీఎం ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తే తీవ్ర పరిమాణాలు ఉంటాయి
  3. బీసీ బిడ్డ కాబట్టే మంత్రి అయినా కొండా సురేఖ ఇంటికి పోలీసులు 
  4. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్   

హైదరాబాద్, అక్టోబర్ 16 (విజయక్రాంతి) :  బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాకే ఎన్నికలకు పోవాలని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ తేల్చి చెప్పారు. చట్టపరంగా, షెడ్యూల్ 9 ప్రకారం ఎన్నికలకు పోవాలని, సీఎం రేవంత్‌రెడ్డి ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తే తీవ్ర పరిమాణాలు ఉంటాయని హెచ్చరించారు. బీసీ రిజర్వేషన్ల సాధనకు చేపట్టబోయే బీసీ బంద్‌లో తెలంగాణ భవన్ నుంచి వెళ్లి పాల్గొంటామని స్పష్టం చేశారు. 

గురువారం తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీఆర్‌ఎస్ బీసీ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తలసాని శ్రీనివాస్‌యాదవ్ మాట్లాడుతూ... రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు. కుల గణన సరిగా జరగలేదని, సర్వే పత్రంపై సీఎం, డిప్యూటీ సీఎం ఫొటో పెట్టడం తప్పు అని విమర్శించారు. బీసీలను మోసం చేసే విధంగా రిజర్వేషన్లపై ప్రభుత్వం వ్యవహరించిన తీరు ఉందన్నారు.

గవర్నర్‌కు తీర్మానం వెళ్లక ముందే ఢిల్లీలో ధర్నా చేశారని ఎద్దేవా చేశారు. మల్లిఖార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కూడాధర్నాకు  రాలేదన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల తర్వాత భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తామని చెప్పారు. బంద్‌లో ప్రతి బీసీ పాల్గొనాలని, అందరూ బంద్‌కి సహకరించాలని పిలుపునిచ్చారు. మంత్రి కొండా సురేఖ ఓఎస్డీ కేసు వివరాల్లోకి వెళ్లబోము, కానీ బీసీ బిడ్డ కాబట్టే కొండా సురేఖ ఇంటికి పోలీసులు వెళ్లగలిగారని అన్నారు. మెయిన్ స్ట్రీమ్ మంత్రుల ఇళ్లకు వెళ్లేవారా అని ప్రశ్నించారు.

దీనిపై ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ... కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేసే వరకు వారి వెంట పడుతూనే ఉంటామని స్పష్టం చేశారు. 6 నెలల్లో బీసీలకు రిజర్వేషన్ అమలు చేస్తామని చెప్పి 17 నెలల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం నిద్ర పోయిందని విమర్శించారు.