17-10-2025 01:31:14 AM
రిజర్వేషన్ల కోసం న్యాయపరంగా పోరాడుతాం
9వ షెడ్యూల్‌లో చేర్చేలా.. మోదీని ఎందుకు ఒప్పించడం లేదు
మంత్రి సురేఖతో మాట్లాడాం.. సీఎం కూడా మాట్లాడుతారు
హైదరాబాద్, అక్టోబర్ 16 (విజయక్రాంతి) : స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లకు బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీలే అడ్డుపడుతున్నాయని పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ విమర్శించారు. బీసీ జేఏసీ ఈ నెల 18న ఇచ్చిన బంద్‌కు కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారు. బీసీ జేఏసీ చైర్మన్ , ఎంపీ ఆర్. కృష్ణయ్య, వైఎస్ చైర్మన్ జాజుల శ్రీనివాస్‌గౌడ్, ఇతర నేతలు గురువారం గాంధీ భవన్‌కు వచ్చిన పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌ను కలిసి బంద్‌కు మద్ద తివ్వాలని కోరారు.
ఈ సందర్భంగా మహేష్‌కుమార్‌గౌడ్ మాట్లాడుతూ... ఎన్నికల సం దర్భంగా ఇచ్చిన కామారెడ్డి డిక్లరేషన్‌కు కట్టుబడి ఉన్నామని, బీసీ రిజర్వేషన్లపై ఎట్టి పరిస్థితుల్లో వెనకడుగు వేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఈ బంద్‌తోనైనా కేంద్ర ప్రభుత్వానికి కనువిప్పు కలగాలని అన్నారు. బీసీ బిల్లుకు బీజేపీ నేతలు అసెంబ్లీలో మద్దతు ఇచ్చి బయటకు వచ్చి మోకాలడ్డుతున్నాని ఆరోపించారు.
బీసీ రిజర్వేషన్లను రాజ్యంగంలోని 9వ షెడ్యూల్ చేర్చే విషయంలో ప్రధాని మోదీని అడిగేందుకు రాష్ర్ట బీజేపీ నేతలు ఎందుకు జంకుతున్నారని ప్రశ్నించా రు. బీజేపీ, బీఆర్‌ఎస్ లోపాయికారి ఒప్పందంతో బీసీ రిజర్వేషన్లకు అడ్డుపడుతు న్నారని ఆరోపించారు. మంత్రి కొండా సురే ఖ విషయంపై సీఎంతో మాట్లాడామని, సీ ఎం రేవంత్‌రెడ్డి కూడా మాట్లాడతానని చె ప్పారని, త్వరలోనే అన్ని సమస్యలను పరిష్కారం అవుతాయని తెలిపారు.
సీపీఎంను కోరిన పీసీసీ చీఫ్
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి మద్దతివ్వాలని సీపీఎం నేతలను పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సీపీఎం ఆఫీసుకు వెళ్లి ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ, పార్టీ నేతలు జూలకంటి రంగారెడ్డి తదితరులను మహేష్‌కుమార్‌గౌడ్ కలిశారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధ్దితో పాటు బీసీ రిజర్వేషన్ల అంశం కూడా ఇరువురు మధ్య చర్చకు వచ్చింది.
బీసీ రిజర్వేషన్ల అమలుకు ప్రభుత్వం చిత్తశుద్ధితోనే ఉందన్నారు. జూబ్లీహిల్స్‌లోనూ కాంగ్రెస్ విజయం సాధిస్తుందని, సీపీఎం మద్దతు కూడా అవసరమన్నారు. పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని సీపీఎం నేతలు చెప్పినట్లుగా కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి.