ఏపీకే ఫైల్స్, తెలియని లింక్స్ పట్ల జాగ్రత్త
సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తతో వ్యవహరించాలి
వారంలోనే జిల్లాలో 38 సైబర్ క్రైమ్ ఫిర్యాదులు నమోదు
జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్
ఆదిలాబాద్, (విజయక్రాంతి): సైబర్ నేరాలలో అప్రమత్తతతో వ్యవహరించి మోసపోకుండా ఉండాలని జిల్లా ప్రజలకు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు. దేశవ్యాప్తంగా సైబర్ నేరగాళ్లు అనేక రకాల పద్ధతులను ఉపయోగిస్తూ అమాయకులను మోసం చేస్తూ ఉంటారని, వారితో జాగ్రత్తగా వ్యవహరించి మోసపోకుండా ఉండాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో ఖాకీ కిడ్స్ పేరుతో సిబ్బంది గ్రామాలను, పాఠశాలలను, కళాశాలలను సందర్శిస్తూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని, ప్రస్తుత సమాజంలో సైబర్ నేరాలు సోషల్ మీడియా ద్వారా జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని, వాటిపట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. అందులో ముఖ్యంగా ఏపీకె ఫైల్స్, తెలియని లింక్స్ ను వాట్సప్ లో గానీ, టెలిగ్రామ్ లో కానీ వినియోగించడం ద్వారా మొబైల్ ఫోన్ సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి వెళ్లి తమ అకౌంట్లు ఖాళీ చేసే ప్రయత్నాలు జరుగుతుంటాయని తెలిపారు.
నిరుద్యోగ యువతీ, యువకులకు జాబ్ ఆఫర్స్ పేరుతో, వర్క్ ఫ్ర హోం ఆఫర్స్ పేరుతో సైబర్ నేరగాళ్లు తక్కువ మొత్తంలో నగదు చెల్లించాలంటూ వివిధ దఫాలుగా ప్రజలను మోసం చేస్తుంటారని తెలిపారు. సోషల్ మీడియాలో వచ్చే ప్రకటనల పట్ల ఆచితూచి వ్యవహరించాలని ప్రతి ఒక్క వ్యాపార ప్రకటన నమ్మసక్యంగా ఉండదని సూచించారు. ఈవారం జిల్లా వ్యాప్తంగా 38 ఫిర్యాదులు సైబర్ క్రైమ్ విభాగంలో నమోదయ్యాయని తెలిపారు. సైబర్ క్రైమ్ జరిగిన వెంటనే 1930 లేదా జాతీయ సైబర్ క్రైమ్ వెబ్ సైట్ లో ఫిర్యాదు చేయాలని, ముఖ్యంగా ఆర్థిక నేరాలలో గంటలోపు ఫిర్యాదు చేస్తే పోయిన డబ్బు తిరిగి వచ్చే ఆస్కారం ఎక్కువగా ఉంటుందని తెలిపారు. ఎలాంటి సైబర్ క్రైమ్ ఫిర్యాదులైన వెంటనే దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ లలోని సైబర్ వారియర్ సిబ్బందిని సంప్రదించాలని సూచించారు.
జిల్లా వ్యాప్తంగా నమోదైన పలు సైబర్ క్రైమ్ వివరాలు ఇలా ఉన్నాయి.
ఆదిలాబాద్ జిల్లాలోని ఉట్నూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నకిలీ, అసభ్యకర సందేశాలతో ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వేధింపులు, వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగ మోసం పేరిట పెన్సిల్ ప్యాకింగ్ ఉద్యోగం అంటూ రూ. 4,150 డబ్బులు మోసం చేసిన ఘటనలు చోటు చేసుకోగా బేలా పోలీస్ స్టేషన్ పరిధిలో ఇన్‌స్టాగ్రామ్ ఇంపర్సనేషన్ (బాధితురాలి పేరుతో నకిలీ ఇన్‌స్టాగ్రామ్ ఖాతా సృష్టించి, ఆమె పరిచయస్తులతో చాట్ చేస్తూ కుటుంబ వివాదాలకు కారణం) ఘటన, ఆదిలాబాద్ వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో లోన్ మంజూరైందని, లోన్ ప్రాసెసింగ్ ఫీజు పేరిట నమ్మించి పలు దఫాలుగా రూ. 35,315 డబ్బులు వసూలు, బోథ్ పోలీస్ స్టేషన్ పరిధిలో అనధికారిక బ్యాంకు లావాదేవీలు (ఎలాంటి లింక్, కాల్ లేదా సందేశం లేకుండానే ఖాతా నుంచి నగదు బదిలీ) జరిపి రూ. 20 వేలు బదిలీ, ఆదిలాబాద్ వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ కార్డు ఉద్యోగిగా పరిచయం చేసుకుని ఓటీపీ తీసుకుని రూ.74,446 నగదు కాజేసిన ఘటన, ఆదిలాబాద్ టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో నగదు చెల్లిస్తే అధిక మొత్తంలో తిరిగి ఇస్తామని వాట్సాప్ ద్వారా నమ్మించి రూ.1,999 డబ్బులు తీసుకుని మోసం, మావల పోలీస్ స్టేషన్ పరిధిలో తీసుకోని లోన్ బకాయి ఉందంటూ పదేపదే కాల్స్ చేసి రూ.3,499 డబ్బులు డిమాండ్, ఆదిలాబాద్ టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆన్‌లైన్ డేటా ఎంట్రీ ఉద్యోగం పేరుతో పని చేయించి, పెనాల్టీ పేరుతో రూ.5,000 డిమాండ్ చేస్తూ బెదిరింపులు లాంటి ఘటనలు చేసుకున్నాయి. సైబర్ మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ సూచించారు.






