18 August, 2026 | 6:36 PM

ఉట్నూర్ ఐటీడీఏ బీఈడీ కళాశాలలో బీఈడీ ప్రవేశాలు

18-08-2026 05:48 PM

ఉట్నూర్,(విజయక్రాంతి): ఉట్నూర్‌లో ఐటీడీ ఆధ్వర్యంలో  నిర్వహిస్తున్న బీఈడీ కళాశాలలో 2026–2028 విద్యా సంవత్సరానికి సంబంధించిన రెండు సంవత్సరాల బీఈడీ కోర్సులో విద్యార్థులకు ప్రవేశాలు కల్పించారు. ఈ సందర్భంగా మంగళవారం నిర్వహించిన కౌన్సెలింగ్, అడ్మిషన్ ప్రక్రియను సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ (ఐటీడీఏ) ప్రాజెక్టు అధికారి మంద మకరందు ప్రారంభించి, విద్యార్థులకు ప్రవేశాలు కల్పించారు.

ఈ సందర్భంగా ప్రాజెక్టు అధికారి మంద మకరందు మాట్లాడుతూ, బీఈడీ కోర్సులో ప్రవేశం పొందిన విద్యార్థులు భవిష్యత్తులో ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎదిగి, గిరిజన ప్రాంతాల్లోని విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేలా కృషి చేయాలని సూచించారు. ఉపాధ్యాయ వృత్తి ఎంతో బాధ్యతాయుతమైనదని, విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని పేర్కొన్నారు. విద్యార్థులు క్రమశిక్షణ, సమయపాలన, నిబద్ధతతో విద్యను అభ్యసిస్తూ, ఆధునిక బోధనా పద్ధతులను నేర్చుకోవాలని సూచించారు.

అలాగే బీఈడీ విద్యార్థులు తమ విద్యా నైపుణ్యాలను పెంపొందించుకోవడంతో పాటు, గిరిజన విద్యార్థుల సామాజిక, విద్యా అవసరాలను అర్థం చేసుకుని వారికి అనుగుణంగా బోధించే సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలని ప్రాజెక్టు అధికారి సూచించారు. భవిష్యత్తులో విద్యారంగంలో మంచి ఉపాధ్యాయులుగా రాణించి, గిరిజన ప్రాంతాల్లో విద్యాభివృద్ధికి తమ వంతు కృషి చేయాలని ఆకాంక్షించారు.

ఈ ప్రవేశ కార్యక్రమంలో డిప్యూటీ డైరెక్టర్ ప్రేమకళ పాల్గొని అడ్మిషన్, కౌన్సెలింగ్ ప్రక్రియను పర్యవేక్షించారు. విద్యార్థుల విద్యా అర్హతలకు సంబంధించిన ధ్రువపత్రాలను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి, సర్టిఫికెట్లను వెరిఫికేషన్ చేసిన అనంతరం అర్హులైన విద్యార్థులకు రెండు సంవత్సరాల బీఈడీ కోర్సులో ప్రవేశాలు కల్పించారు.

 కౌన్సెలింగ్ కార్యక్రమానికి విద్యార్థులతో పాటు సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన వారి తల్లిదండ్రులు కూడా హాజరయ్యారు. కళాశాలలో అందిస్తున్న విద్యా సౌకర్యాలు, బోధనా విధానం, విద్యార్థులకు కల్పిస్తున్న వసతుల గురించి అధికారులు వారికి వివరించారు. ప్రవేశ ప్రక్రియను పారదర్శకంగా, నిబంధనల ప్రకారం నిర్వహించినట్లు అధికారులు తెలిపారు.

గిరిజన ప్రాంతాల్లో నాణ్యమైన ఉపాధ్యాయులను తయారు చేయడంలో ఐటీడీఏ బీఈడీ కళాశాల కీలకపాత్ర పోషిస్తోందని, ఇక్కడ శిక్షణ పొందిన విద్యార్థులు భవిష్యత్తులో గిరిజన విద్యార్థుల విద్యాభివృద్ధికి తోడ్పడాలని ప్రాజెక్టు అధికారి మంద మకరందు ఆకాంక్షించారు.