ఉపాధికి ఊతం తేనెటీగల పెంపకం
రైతులకు అదనపు ఆదాయ వనరు
ఆదాయంతో పాటు పంట అధికదిగుబడికి దోహదం
జిల్లా వ్యవసాయ అధికారి పి.వెంకటరమణారెడ్డి
సంస్థాన్ నారాయణపూర్,(విజయక్రాంతి): తేనెటీగల పెంపకం ద్వారా రైతులు అదనపు ఆదాయాన్ని పొందవచ్చని జిల్లా వ్యవసాయ అధికారి వెంకటరమణారెడ్డి అన్నారు.నారాయణపురం మండలం మహ్మదాబాదు గ్రామంలో రైతు ప్రముఖరెడ్డి వ్యవసాయ క్షేత్రంలో నిమ్మల రామచంద్రయ్య మిత్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తేనెటీగల పెంపకాన్ని రైతునేస్తం వ్యవసాయ కార్యక్రమంలో భాగంగా సందర్శించారు.పండ్ల తోటతో పాటు తేనెటీగల పెంపకం ద్వారా పొందుతున్న ఆదాయాన్ని పరిశీలించారు.
మొదట 300 పెట్టెల ద్వారాతేనెటీగల పెంపకాన్ని ప్రారంభించామని ఒక్కో పెట్టె ద్వారా రెండు కిలోల తేనె ఉత్పత్తి అవుతుందని దానిని కిలో 900 రూపాయల చొప్పున రాచకొండ హానీ బ్రాండ్ పేరుతో మార్కెట్లో విక్రయిస్తున్నట్టు నిర్వాహకులు తెలిపారు.తేనెటీగల ద్వారా ఆదాయం లభించడమే కాకుండా పంటల్లో పరాగసంపర్కం మెరుగుపడి పంట దిగుబడి, నాణ్యత పెరగడానికి దోహదపడుతుందని వివరించారు.మిత్ర ఫౌండేషన్ రైతులకు తేనెటీగల పెంపకంపై అవగాహన నిర్వహణ పద్ధతులను అవసరమైన సాంకేతిక సూచనలను అందిస్తుందని అన్నారు.రైతులు ఇలాంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఆదాయాన్ని పొందవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారి పూజ,వ్యవసాయ విస్తరణ అధికారి రాజేష్,మిత్ర ఫౌండేషన్ నిమ్మల రామచంద్రయ్య,ప్రముఖరెడ్డి, రైతులు తదితరులు పాల్గొన్నారు.






