సునంద రైస్ మిల్‌పై కేసు నమోదు
బాధ్యులపై కేసు... రిమాండ్‌కు తరలింపు
గరిడేపల్లి,(విజయక్రాంతి): సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండల కేంద్రంలోని సునంద రైస్ మిల్‌పై ఎన్ఫోర్స్‌మెంట్ టాస్క్‌ఫోర్స్ అధికారులు ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. తనిఖీల్లో సుమారు 8 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం నిల్వల్లో తేడాలు గుర్తించినట్లు సివిల్ సప్లైస్ అధికారులు తెలిపారు. ఈ ధాన్యం విలువ సుమారు రూ.22 కోట్ల వరకు ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. టాస్క్‌ఫోర్స్ అధికారులు శుక్రవారం మిల్లుపై దాడులు నిర్వహించగా, అనంతరం శనివారం సివిల్ సప్లైస్ అధికారులు మిల్లులో తనిఖీలు చేపట్టి వివరాలను పరిశీలించారు. తనిఖీల ఆధారంగా కేసు నమోదు చేసిన అధికారులు తదుపరి చర్యలు చేపట్టారు.
ఈ వ్యవహారంలో మిల్లు పార్ట్‌నర్లుగా ఉన్న కస్తూరి సునంద, అవినాష్, ఆకాష్, అలాగే అకౌంటెంట్ ఇంజమూరి గౌతమ్ పై కేసు నమోదు చేసినట్లు సమాచారం. సోమవారం వారిని రిమాండ్‌కు తరలించి జైలుకు పంపినట్లు తెలిసింది. కాగా, కేసు నమోదు కాకుండా ఉండేందుకు మిల్లుకు సంబంధించిన వ్యక్తులు పెద్ద ఎత్తున పైరవీలు చేసినట్లు స్థానికంగా ప్రచారం జరుగుతోంది. అయితే పోలీసులు ఎలాంటి ఒత్తిళ్లకు తలొగ్గకుండా నిబంధనల ప్రకారం చర్యలు తీసుకున్నట్లు సమాచారం.






