వెంక ట్రామయ్య గారి తాలూకా
కోమలి క్రియేషన్స్ బ్యానర్‌పై కోమలి మహేందర్ తొట్టె, సోమేశ్ సారిపల్లి నిర్మిస్తున్న కొత్త సినిమా ‘వెంకట్రామయ్య గారి తాలూకా’. ఈ సినిమాతో ఈటీవీ ప్రభాకర్ కూతురు దివిజ ప్రభాకర్ హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తుండగా, దినేశ్‌కుమార్ హీరోగా పరిచయమవుతున్నాడు. ఈ సినిమాకు సతీశ్ ఆవాల స్టోరీ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ అందిస్తూ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో మురళీధర్‌గౌడ్, సుధ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
కాశీవిశ్వనాథ్, మిర్చి మాధవి, సత్యశ్రీ, ఇక్బాల్, జీవనప్రియ, గౌరీనాయుడు, హరీశ్ టెక్కలి, సంతూ ముంజేటి, హాసిని, యామిని ఇతర పాత్రల్లో కనిపించనున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా జూలైలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ విషయాన్ని ప్రకటిస్తూ మేకర్స్ తాజాగా మూవీ కాన్సెఫ్ట్‌ను, నటీనటులు, సాంకేతిక సిబ్బంది వివరాలను తెలియజేశారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత కోమలి మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. “ఇప్పటివరకు జానపద గాయనిగా నాకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నా.
సినిమా రంగంపై నాకున్న ఇష్టంతో నిర్మాతగా మారాను. సినిమా తీసే క్రమంలో చాలా ఒడిదుడుకులను ఎదుర్కొన్నాను. మొత్తానికి ‘వెంకట్రామయ్య గారి తాలూకా’ చిత్రాన్ని పూర్తి చేశాం. జూలైలో మూవీని విడుదల చేస్తున్నాం” అని తెలిపారు. దర్శకుడు సతీశ్ అవాల మాట్లాడుతూ.. “అందమైన పల్లెటూరులో వెంకట్రమయ్య అనే పరువుగల కుటుంబం కథే మా సినిమా. ప్రస్తుతం మానవీయ బంధాలన్నీ ఆర్థిక సంబంధాలుగా మారిపోయాయి.
తల్లిదండ్రులు వాళ్ల కడుపు కట్టుకుని ఎన్నో కష్టాలను భరిస్తూ నలుగురు పిల్లలున్నప్పటికీ వారిని అల్లారుముద్దగా పెద్ద చేస్తున్నారు. కానీ ఆ పిల్లలు నలుగురూ కలిసి వృద్ధాప్యంలో తల్లిదండ్రులను పోషించలేకపోతున్నారు. తల్లిదండ్రుల గొప్పతనం తెలియచేసే ఈ సినిమా మంచి ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కిస్తున్నాం. కుటుంబంతో కలిసి థియేటర్‌కు వెళ్లి హాయిగా చూస్తూ ఎంజాయ్ చేసేలా ఉంటుందీ సినిమా” అని తెలిపారు. చరణ్ అర్జున్ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి బీ అనిల్‌కుమార్ కెమెరా మెన్ కాగా, మార్తాండ్ కే వెంకటేశ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు.






