బెల్ట్ షాపులను వెంటనే మూసివేయాలి
కుమ్రం భీం ఆసిఫాబాద్, ఆగస్టు 9(విజయ క్రాంతి): కాగజ్నగర్ మండలం బట్టుపల్లి గ్రామపంచాయతీ పరిధిలో కొనసాగుతున్న బెల్ట్ షాపులను వెంటనే మూసివేయాలని డిమాండ్ చేస్తూ ఐద్వా, డీవైఎఫ్‌ఐ, వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఆదివారం గ్రామపంచాయతీ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు.ఈ సందర్భంగా ఐద్వా జిల్లా కార్యదర్శి దుర్గం అనిత మాట్లాడుతూ గ్రామాల్లో విచ్చలవిడిగా బెల్ట్ షాపులు నిర్వహించడం వల్ల పేద, మధ్యతరగతి కుటుంబాలు తీవ్రంగా నష్టపోతున్నాయని అన్నారు.
మద్యం సులభంగా అందుబాటులో ఉండటంతో యువత మద్యానికి బానిసలుగా మారుతున్నారని, కుటుంబాల్లో ఆర్థిక ఇబ్బందులు, గొడవలు పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.మద్యం కారణంగా మహిళలు, పిల్లలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, కుటుంబ ఆదాయంలో గణనీయమైన భాగం మద్యానికి ఖర్చవుతుండటంతో పిల్లల చదువులు, కుటుంబ అవసరాలు దెబ్బతింటున్నాయని తెలిపారు.
బట్టుపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని బెల్ట్ షాపులను తక్షణమే మూసివేసి, అనధికారిక మద్యం విక్రయాలపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.బెల్ట్ షాపులు మూసివేసే వరకు ప్రజలను సమీకరించి దశలవారీగా ఉద్యమాన్ని కొనసాగిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఐద్వా జిల్లా అధ్యక్షురాలు మాచర్ల వినోద, జిల్లా కోశాధికారి షాహిని, డీవైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి గొడిసెల కార్తీక్, జిల్లా ఉపాధ్యక్షుడు దుర్గ నిఖిల్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి ముంజం ఆనంద్, ఆర్టీఏ జిల్లా అధ్యక్షుడు ప్రవీణ్తో పాటు మహిళలు, యువకులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.






