ఘనంగా బోనాల పండుగ
కుమ్రం భీం ఆసిఫాబాద్, ఆగస్టు 9(విజయ క్రాంతి): ఆసిఫాబాద్ మండలంలోని మోతుగూడ గ్రామంలో ఆదివారం బోనాల పండుగను గ్రామస్తులు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. పండుగ సందర్భంగా గ్రామంలోని మహిళలు సంప్రదాయబద్ధంగా బోనాలను అలంకరించి, వాటిని ఎత్తుకొని శోభాయాత్రగా అమ్మవారి ఆలయానికి తరలివెళ్లారు.మహిళలు బోనాలతో గ్రామ వీధుల్లో శోభాయాత్ర నిర్వహించడంతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది.
అనంతరం అమ్మవారి ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారికి బోనాలు, నైవేద్యాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులు కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
ఈ సందర్భంగా గ్రామానికి సమృద్ధిగా వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని, రైతులు సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని వేడుకున్నారు. గ్రామ ప్రజలందరూ పిల్లాపాపలతో సుఖసంతోషాలతో, ఆయురారోగ్యా లతో, అష్టైశ్వర్యాలతో జీవించాలని ప్రార్థించారు.బోనాల పండుగను పురస్కరించుకుని మహిళలు సంప్రదాయ దుస్తులు ధరించి భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు. చిన్నారులు, యువత, గ్రామ పెద్దలు, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరు అయ్యారు.






