01-10-2025 12:00:00 AM
నల్లగొండ, సెప్టెంబర్ 30 (విజయక్రాంతి) : అధికారుల నిర్లక్ష్యం.. పాలకుల పరిహాసం.. ఫలితంగా మందుబాబుల జేబులు గుళ్లవుతున్నాయి. మద్యం అమ్మకాల్లో నిబంధనలకు నీళ్లొదిలి.. సిండికేట్ దందాకు అక్రమార్కులు తేరలేపారు. అడ్డుకోవాల్సిన అధికారులు.. అందినకాడికి దండుకుని సైలెంట్ అయిపోతున్నారు. దీంతో మద్యం అమ్మకాల్లో సిండికేట్ వ్యాపారులు ఆడిందే ఆట.. పాడిందే పాటగా మారిపోయింది.
ఈజీ మనీ కోసం గ్రామీణ ప్రాంతాల్లోనూ బెల్ట్ దుకాణాలు పుట్టగొడుగుల్లా తయారయ్యాయి. వీటిపై అధికారుల నియంత్రణ లేకపోవడంతో సిండికేట్ దందా మూడు పువ్వులు.. ఆరు కాయలుగా సాగుతోంది. నిత్యం ఉమ్మడి నల్లగొండ జిల్లావ్యాప్తంగా రూ.కోట్లలో దందా జరుగుతోందంటే అతిశయోక్తి కాదు. ప్రధానంగా సరిహద్దు ప్రాంతాల్లో వ్యాపారులకు మద్యం అమ్మకాలు కాసులు కురిపిస్తోంది.
ఒక్కో బాట్పి రూ.50 వరకు అధికం...
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సిండికేట్ దందా పుణ్యమంటూ మద్యం బాటిళ్ల ధరలు ఆకాశన్నంటుతున్నాయి. అదేంటి మద్యం బాటిళ్ల ధరను ముందుగానే నిర్ణయిస్తే.. ధరలు ఆకాశన్నంటడం ఏమిటి అనుకుంటున్నారా.. మరేం లేదండీ.. ఏ మండలానికి ఆ మండలంలోని మద్యం వ్యాపారులు సిండికేట్గా ఏర్పడి.. కొత్త దందాకు తేరలేపారు. ఆయా మండలాల పరిధిలోని మద్యం దుకాణాల్లో ఎమ్మార్పీ ధరలకే మద్యం విక్రయిస్తుండగా, బెల్ట్ దుకాణాల్లో మాత్రం ఒక్కో బాట్పి రూ.30 నుంచి రూ.50 వరకు అధిక ధర వసూలు చేస్తున్నారు.
వ్యాపారులు సిండికేట్గా ఏర్పడి.. మండల పరిధిలోని ప్రతి గ్రామంలో ఏర్పాటు చేసే బెల్ట్ దుకాణాలకు సరఫరా చేసే మద్యానికి ప్రత్యేకంగా స్టిక్కర్ వేస్తారు. ఈ స్టిక్కర్ లేని మద్యం బాటిళ్లను బెల్ట్ దుకాణాల్లో అమ్మడం నిషిద్ధం. అలా ఎవరైనా అమ్మితే ఎక్సైజ్ అధికారులతో దాడులు చేయించి కేసులు నమోదు చేస్తుంటారు. దీంతో బెల్ట్ దుకాణదారులు సిండికేట్ నుంచే మద్యం బాటిళ్లను ఎమ్మార్పీ కంటే రూ.10 నుంచి రూ.20 అదనంగా ఇచ్చి తీసుకెళ్తుంటారు. ఈ డబ్బును బెల్ట్ దుకాణాల్లో మద్యం సేవించేందుకు వచ్చిన మందుబాబుల నుంచి ఒక్కో బాట్పి రూ.30 నుంచి రూ.50 వరకు అదనంగా వసూలు చేస్తుంటారు.
ఇచ్చిన బ్రాండ్ తాగాల్సిందే..
మద్యం దుకాణాల్లో నచ్చిన బ్రాండ్ కొనుగోలు చేసి తాగే పరిస్థితి మద్యం ప్రియులకు లేకుండా పోయింది. నిజానికి మద్యం దుకాణాల్లో ప్రతి బ్రాండ్ మద్యం దొరకాల్సి ఉంటుంది. కానీ పలు బ్రాండెడ్ కంపెనీలు మార్జిన్(కమీషన్) తక్కువగా ఇస్తుంటాయి. కొన్ని బ్రాండ్లపై మాత్రమే మార్జిన్ అధికంగా ఉంటుంది. దీంతో మద్యం దుకాణాల యాజమాన్యాలు మార్జిన్ అధికంగా ఇచ్చే కంపెనీలకు చెందిన మద్యం బాటిళ్లను మాత్రమే విక్రయించేందుకు మొగ్గు చూపుతున్నారు.
మద్యం దుకాణాల్లో దొరకని మంచి బ్రాండ్ల మద్యం.. బెల్ట్ దుకాణాల్లో మాత్రం దర్శనమిస్తుంది. కాకపోతే ఇక్కడ ఒక్కో బాటిల్కు అదనంగా డబ్బు సమర్పించుకోవాల్సిందే. మద్యం దుకాణాల్లో దొరకని మద్యం.. బెల్ట్ దుకాణాల్లో దొరకడం వెనుక సిండికేట్ దందా చక్రం తిప్పుతుండడం గమనార్హం. మద్యం దుకాణాల్లో మంచి బ్రాండ్ల మద్యం ఉన్నా.. స్టాక్ లేదంటూ మందుబాబులకు ఇవ్వకుండా మాములు బ్రాండ్ల మద్యాన్ని అంటగట్టే ప్రయత్నం చేస్తుంటారు.
సరిహద్దు ప్రాంతాల్లో జోరు..
ఉమ్మడి నల్లగొండ జిల్లావ్యాప్తంగా మద్యం అమ్మకాల్లో సిండికేట్ దందాదే కీలక పాత్ర. ప్రధానంగా జిల్లా సరిహద్దుగా ఉన్న ప్రాంతాల్లో సిండికేట్, బెల్ట్ దుకాణాల వ్యవహారం జోరు మీద ఉంది. కోదాడ, హుజూర్నగర్, నాగార్జునసాగర్, మిర్యాలగూడ నియోజకవర్గాల్లోని కొన్ని మద్యం దుకాణాల వ్యాపారులకు కాసుల వర్షం కురుస్తోంది. పొరుగు రాష్ట్రమైన ఏపీలో మద్యం అమ్మకాలపై ఆంక్షలు ఉండడం.. వీరికి బాగా కలిసొస్తుంది.
మందుబాబులు అక్కడ అధిక ధరలకు మద్యం కొనుగోలు చేయలేక.. తెలంగాణ ప్రాంతంలోకి వచ్చి మద్యం సేవిస్తుంటారు. ఇదే సమయంలో మద్యం అక్రమ రవాణకు తేరలేపారు. ఇందుకు బెల్ట్ దుకాణాలే ప్రధాన కేంద్రంగా మారాయి. గ్రామీణ ప్రాంతాల్లోని బెల్ట్ దుకాణాల్లో విక్రయించేందుకంటూ మద్యం బాటిళ్లను భారీగా తీసుకెళ్లి.. ఏపీకి అక్రమంగా తరలించి కొంతమంది సొమ్ము చేసుకుంటున్నారు. ఇందులో ఏకంగా ఎక్సైజ్, పోలీసు, అధికార పార్టీ నేతల ప్రమేయం ఉన్నట్టు ఆరోపణలు విన్పిస్తున్నాయి.
ప్రతి నెలా భారీగా మాముళ్లు..
మద్యం దుకాణాల వ్యాపారులు సిండికేట్ దందాకు తేరలేపడంతో అనధికారికంగా ప్రతినెలా రూ.కోట్లు చేతులు మారుతున్నాయి. ఈ అక్రమ దందాలో అధికారులు, ప్రజాప్రతినిధులు సైతం భాగస్వామ్యులవ్వడం కొసమెరుపు. సిండికేట్ దందాకు సహకరిస్తూ.. ప్రతి నెలా ‘తిలా పాపం.. తలా పిడికేడు’ అన్న చందంగా రూ.లక్షల ముడుపులు తీసుకుని మౌనం వహిస్తున్నారు.
నిజానికి మద్యం దుకాణాల ఎంపిక ప్రక్రియలో అలాట్ అయ్యిన లబ్ధిదారుల నుంచి సిండికేట్ వ్యాపారులు అధిక ధరకు కొనుగోలు చేసి.. ఈ తరహా దందాకు తేరలేపుతున్నారు. మద్యం దుకాణాల లాటరీ ఎంపిక ప్రక్రియలో మద్యం దుకాణాలను దక్కించుకునే వ్యక్తి కొత్తవారు అయినా.. మద్యం వ్యాపారం అంతగా తెలియని వారికి దుకాణం తగిలితే.. వారికి గుడ్ విల్ కింద రూ.లక్షలు ముట్టజెప్పి దుకాణాన్ని వారి నుంచి తీసుకుంటారు.
రూ.లక్షల పెట్టుబడికి రూ.కోట్ల లాభం రాబట్టుకునేందుకు సిండికేట్ దందాకు దారితీస్తుంటారు. ఈ దందా కోసం ఎక్సైజ్ అధికారుల నుంచి ప్రజాప్రతినిధుల వరకు ఎవరెవరికీ ఎంత వాటా ఇవ్వాలనేది ముందుగానే నిర్ణయించారు. ఆ తరహా వ్యవహారమే ఇటీవల నల్లగొండ జిల్లా కేంద్రంతో పాటు తుంగతుర్తి నియోజకవర్గంలోనూ వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటికైనా ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని మద్యం అమ్మకాల్లో సిండికేట్ దందా, బెల్ట్ దుకాణాల జోరుకు చెక్ పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందనే చెప్పాలి.