01-10-2025 11:43:47 AM
హైదరాబాద్: తెలంగాణ కొత్త డీజీపీగా బి. శివధర్‌రెడ్డి(Shivadhar Reddy takes charge) బుధవారం నాడు బాధ్యతలు స్వీకరించారు. తెలంగాణ 6వ డీజీపీగా(Telangana DGP) 1994 బ్యాచ్ ఐపీఎస్ అధికారి శివధర్‌రెడ్డి డీజీపీ కార్యాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం డీజీపీ శివధర్‌రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ప్రజల రక్షణే ధ్యేయంగా పనిచేస్తామన్నారు. తనను డీజీపీగా నియమించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తమకు బలమైన జట్టు ఉందన్నారు. ఖాళీగా ఉన్న పోస్టులను త్వరగా భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని కోరుతామన్న ఆయన క్షేత్రస్థాయిలో సాంకేతికతను వినియోగించుకుంటామని తెలిపారు.
స్థానిక సంస్థల ఎన్నికలను(Telangana local body elections) సమర్థంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తామన్నారు. పోలీసుశాఖకు సహకారం అందించాలని ఆయన కోరారు. బేసిక్ పోలీసింగ్ సాయంతో సమర్థంగా విధులు నిర్వహిస్తామన్నారు. పోరాట మార్గం వీడేందుకు సిద్ధమని నక్సల్స్ నేత ఇటీవల లేఖ రాశారని గుర్తుచేశారు. జనజీవన స్రవంతిలో కలిసిపోవాలని శివధర్ రెడ్డి(Shivadhar Reddy) నక్సల్స్ ను పిలుపునిచ్చారు. మావోయిస్టు సిద్ధాంతాలు(Maoist ideology) ఆచరణలో విఫలమయ్యాయని భావిస్తున్నామని తెలిపారు. లొంగిపోయిన నక్సల్స్ కు అన్ని రకాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. సమాజ అభివృద్ధిలో భాగం కావాలని నక్సల్స్ ను కోరారు. పీఎస్ ల సంఖ్య కంటే పోలీసుల్లో నైపుణ్యం పెంచాలని తన అభిప్రాయం అన్నారు. శాంతియుతంగా నిరసనలు చేసే హక్కు అందరికీ ఉందన్నారు. పోలీసుశాఖ ప్రత్యేక విభాగాల్లోని ఖాళీలను నిపుణులతో భర్తీ చేస్తామని శివధర్‌రెడ్డి వెల్లడించారు.