ఒకేసారి రూ.12 వేల కోట్ల బెనిఫిట్స్ విడుదల చేయాలి
- ఈహెచ్‌ఎస్ స్కీంపై విడుదలకాని ఉత్తర్వులు
- ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి
హైదరాబాద్, మార్చి 18 (విజయక్రాంతి): రిటైరైన ఉద్యోగ, ఉపాధ్యాయులకు సంబంధించిన రిటైర్‌మెంట్ పెండింగ్ బెనిఫిట్స్ రూ.12 వేల కోట్లు ఉన్నాయని, ప్రతి నెలా రూ.వెయ్యి కోట్లు అవసరమైతే రూ.700 కోట్లు ఇస్తే సరిపోవని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగలి శ్రీపాల్ రెడ్డి తెలిపారు. పక్కనున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏక మొత్తంలో విడుదల చేసినట్లుగా మన రాష్ట్రంలోనూ ఒకేసారి రూ.12 వేల కోట్లు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని ఆయన కోరారు. బుధవారం శాసనమండలిలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతూ ఆయన మాట్లాడారు.
రెండు సంవత్సరాలుగా రిటైర్ బెనిఫిట్స్ అందక చాలా మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని, వైద్యం చేయించుకునే దీనపరిస్థితుల్లో ఉన్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈహెచ్‌ఎస్ స్కీంపై ప్రభు త్వం ఇంత వరకూ ఉత్తర్వులు విడుదల చేయకపోవడంతో ఈ స్కీం అమలవుతుందో లేదోనని ఉద్యోగుల్లో అనుమానాలున్నాయని తెలిపారు.
కులగణన చేసిన టీచర్లకు ఇంత వరకూ డబ్బులు విడుదల చేయలేదని, ఎంప్లాయీ ఐడీకి ఆధార్ అనుసంధానం చేసుకోవాలని ఆర్థిక శాఖ ఉత్తర్వులిస్తే కొన్ని సాంకేతిక కారణాలతో 1.40 లక్షల మంది ఉపాధ్యాయుల్లో కేవలం 225 మంది ఆధార్ కార్డులు మిస్ మ్యాచ్ అయితే వారికి జీతాలు నిలిపివేయడం దారుణమన్నారు. విద్యార్థులకు డైట్, కాస్మొటిక్ ఛార్జీలను మరింత పెంచాలని, 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు పాత పెన్షన్ వర్తింపజేయాలని ప్రభుత్వాన్ని ఆయన కోరారు.




