19 March, 2026 | 3:36 AM

ఆర్టీసీ ఉద్యోగులకు 2 పీఆర్సీలు ఇవ్వాలి

19-03-2026 01:57 AM
  1. బీసీ సబ్ ప్లాన్ అమలెక్కడ?

డిజిటల్ మీడియా పాలసీ తేవాలి

మండలిలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న

హైదరాబాద్, మార్చి 18 (విజయక్రాంతి): ఆర్టీసీ కార్మికులకు రెండు పీఆర్సీలను వెంటనే విడుదల చేయాలని, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న డిమాండ్ చేశారు. ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిష్కరించాలని కోరారు. ఔట్ సోర్సింగ్ ఏజెన్సీలను ఎత్తివేసి కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసి, ప్రభుత్వమే జీతాలు ఇవ్వాలని తెలిపారు.

ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతాల్లో 34 శాతం కమీషన్ కట్ వెంటనే ఆపాలని కోరారు. బుధవారం శాసనమండలిలో ఆయన మాట్లాడుతూ...కాకతీయ వర్సిటీలో ప్రొఫెసర్లు, కాంట్రాక్టు ఉద్యోగులు, విద్యార్థుల సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. విద్యార్థినుల హెల్త్ కిట్స్, పాఠశాల మరుగుదొడ్ల కోసం కేటాయించిన నిధులు ఖర్చు చేయడంలేదని విమర్శించారు.

బీసీ సబ్ ప్లాన్  హామీ ఏమైందని, సమాన అవకాశాలు కల్పించడమే నిజమైన సామాజిక న్యాయమని పేర్కొన్నారు. బీసీ సబ్ ప్లాన్ అమలు చేయాలని, సంవత్సరానికి 20 వేల కోట్ల బడ్జెట్ ఏమైందని, గవర్నర్ ప్రసంగంలో బీసీల అంశం లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. వీఆర్‌ఏలు, మీటర్ రీడింగ్ కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని విజ్ఞప్తి చేవారు.

ప్రజలు డిజిటల్ మీడియా వైపు చూస్తున్నారని, ప్రభుత్వం డిజిటల్ మీడియా పాలసీని తీసుకురావాలని ఆయన కోరారు. జర్నలిస్టులకు హెల్త్ కార్డులు ఇవ్వాలని, ప్రస్తుతం ఉన్న కార్డులు ఏ హాస్పిటల్స్‌లో పనిచేయడంలేదని తెలిపారు. జర్నలిస్టులపై దాడులు జరగకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.