10 May, 2026 | 1:22 AM

బీజేపీ బలాన్ని పెంచిన బంగాల్

10-05-2026 12:00 AM

డా.తిరునహరి శేషు :

ఉత్తర భారతం, పశ్చిమ భారతాల్లో బలంగా ఎదిగిన బీజేపీ ఇప్పుడు తూర్పు ప్రాంతానికి కూడా విస్తరించి మూడు ప్రాంతాల్లో బలమైన రాజకీయ శక్తిగా ఎదిగింది. కానీ, దక్షిణాదిలో మాత్రం బీజేపీ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారుతోంది. దక్షిణాదిలో ఒక్క కర్ణాటకలో తప్ప మిగతా రాష్ట్రాల్లో బీజేపీ పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంది. 

ఐదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికలలో అనూహ్య ఫలితాలే వెలువ డ్డాయి. ముఖ్యంగా బంగాల్‌లో బీజేపీ గెలుపు, తమిళనాడులో విజయ్ తమిళగ వెట్రి కళగం (టీవీకే) విజయం సాధించ టం దేశ రాజకీయాల్లో ఒక కీలక పరిణామంగానే చూడాలి. దేశానికి స్వాతంత్య్రం తర్వాత బంగాల్‌లో మొదటిసారి బీజేపీకి అవకాశం దక్కడం, ఆరు దశాబ్దాల తర్వాత రెండు బలమైన ద్రవిడ పార్టీలను వెనక్కినెట్టి పోటీచేసిన మొదటిసారే టీవీకే విజ య్ విజయం సాధించటం రాజకీయ వర్గాలనే ఆశ్చర్యపరుస్తోంది.

కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో అధికారంలో ఉన్న రంగస్వామి నేతృత్వంలోని ఎన్‌ఆర్ కాంగ్రెస్, హిమంత బిశ్వ శర్మ నాయకత్వంలోని బీజేపీ అస్సాంలో తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటే.. కేరళ, తమిళనాడు, పశ్చి మ బెంగాల్ రాష్ట్రాల్లో మాత్రం అధికార పార్టీలకు చుక్కెదురైంది. తూర్పున మమతాబెనర్జీ, దక్షిణాన స్టాలిన్ ఓటమి దేశ రాజకీయాలను ప్రభావితం చేయడమే కాదు, బలమైన ప్రాంతీయ పార్టీల నేతల రాజకీయ భవితవ్యాన్ని కూడా ప్రభావితం చేయబోతుంది.

బీజేపీ మాత్రమే మూడు చోట్ల

ఐదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికల ఫలితాల్లో మూడు రాష్ట్రాల్లో అధికార పార్టీలు ఓటమిపాలవగా, బీజేపీ మాత్రం తాను అధికారంలో ఉన్న అసోంతో పాటు సంకీర్ణ భాగస్వామిగా ఉన్న కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిని కూడా నిలబెట్టుకుని బంగాల్ లాంటి కీలకమైన రాష్ట్రంలో మొదటిసారి విజయం సాధించింది. దీంతో దేశ రాజకీయాలలో ఆ పార్టీ బలం మరింత పెరిగింది. బీజేపీ బంగాల్ శాసనసభ ఎన్నికల్లో గెలిచిన తర్వాత ప్రధాని మోదీకి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అభినందనలు తెలిపారు.

అంటే బంగాల్  గెలుపుని బీజేపీ ఎంత ప్రతిష్టాత్మకంగా భావించిందో అర్థం చేసుకోవచ్చు. ఎక్కడ, ఏ ఎన్నిక జరిగినా 2024 లోక్‌సభ ఎన్నిక ల ఫలితాలు పునరావృతం కాకూడదని బీజేపీ జాగ్రత్తపడుతోంది కాబట్టే, హర్యా నా, మహారాష్ట్ర, ఢిల్లీ, బీహార్ లాంటి రాష్ట్రాలతో పాటు ఇప్పుడు బంగాల్‌లో కూడా బీజేపీ అద్భుత విజయాన్ని సాధించి, దేశంలో ఒక తిరుగులేని రాజకీయ శక్తిగా ఎదిగింది. బంగాల్ గెలుపుతో దేశంలోని 17 రాష్ట్రాల్లో బీజేపీ, ఎన్డీయే భాగస్వామ్య పార్టీలతో కలిసి 22 రాష్ట్రాల్లో అధికారంలో ఉంది.

దేశంలో 78 శాతం ప్రజలు, 73 శాతం భూభాగం ఎన్డీయే పాలన కిందకి రావటంతో బీజేపీ ఒక బలీయమైన రాజకీయ శక్తిగా కనపడుతోంది. ఇప్పటికే ఉత్తర భారతంలో బలమైన రాజకీయ శక్తిగా ఎదిగిన బీజేపీ ఇప్పుడు బంగాల్‌లో సాధించి న విజయంతో తూర్పు ప్రాంతం కూడా బీజేపీ ఛత్రం కిందకి వచ్చినట్లు అయింది. బీజేపీ అధికారంలో ఉన్న బీహార్ (వంగ), బంగాల్ (బంగ) ఒరిస్సా (కళింగ) రాష్ట్రాల్లోని 103 లోక్‌సభ స్థానాలపై పట్టుచిక్కితే రాజకీయంగా బీజేపీ బలం మరింత పెరుగుతుంది. 

తమ పార్టీ సిద్ధాంతకర్త శ్యామప్రసాద్ ముఖర్జీ జన్మస్థలం బంగాల్‌లో విజయం సాధించటాన్ని బీజేపీ చారిత్రాత్మక విజయంగా భావిస్తుంది. దేశంలో ఉత్తరప్రదేశ్ (80 లోక్‌సభ స్థానాలు) మహారాష్ట్ర( 48), తరువాత 42 లోక్‌సభ స్థానాలతో బంగా ల్ మూడవ అతిపెద్ద రాష్ట్రం. కాబట్టి బంగాల్ విజయం బీజేపీకి రాజకీయంగా కలిసివచ్చే అంశంగానే చూడాలి. బీజేపీకి ఇంటిలో పోరు లేకపోయినా తృణమూల్ కాంగ్రెస్ లోక్‌సభ సభ్యులు కళ్యాణ్ బెనర్జీ, మహువా మొయిత్రా, సయాని గోష్, అభిషేక్ బెనర్జీ లాంటివారు లోక్‌సభలో బీజేపీకి కంటిలో నలుసుగా, చెవిలో జోరీగా మారారు.

కాబట్టి బంగాల్‌లో టీఎంసీని ఓడించటం బీజేపీకి రాజకీయంగా కొంత ఉపశమనం కలిగించేదే. 294 శాసనసభ స్థానాలు ఉన్న బంగాల్ అసెంబ్లీలో బీజేపీ 207 శాసనసభ స్థానాల్లో విజయం సాధించటం రాబోయే పంజాబ్, ఉత్తరప్రదేశ్, గుజరాత్ శాసనసభ ఎన్నికలలో ఆ పార్టీకి కలిసివస్తుంది.

2016 బంగాల్ శాసనసభ ఎన్నికలలో మూడు శాసనసభ స్థానాలు గెలిచిన బీజేపీ ఒక దశాబ్ద కాలంలోనే ఆ రాష్ట్రంలో భారీ మెజార్టీతో అధికా రంలోకి రావడానికి అనుసరించిన విధానాలు, వ్యూహాలపై కూడా అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. వ్యవస్థలను అడ్డం పెట్టుకొని ప్రజలలో భావోద్వేగాలను రెచ్చగొట్టి గెలిచిందనే విమర్శలు కూడా బలంగా వినపడుతున్నాయి. 

దక్షిణాదిలో తప్పని నిరీక్షణ

ఉత్తర భారతం, పశ్చిమ భారతాల్లో బలంగా ఎదిగిన బీజేపీ ఇప్పుడు తూర్పు ప్రాంతానికి కూడా విస్తరించి మూడు ప్రాంతాల్లో బలమైన రాజకీయ శక్తిగా ఎదిగింది. కానీ, దక్షిణాదిలో మాత్రం బీజేపీ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారుతోం ది. దక్షిణాదిలో ఒక్క కర్ణాటకలో తప్ప మిగతా రాష్ట్రాల్లో బీజేపీ పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో ఒక్క పుదుచ్చేరిలో మాత్రమే నాలుగు స్థానాలలో విజయం సాధించినా, తన ఓటు బ్యాంకుని ఒక శాతానికి పైగా కోల్పోయింది.

తమిళనాడులో అన్నాడీఎంకేతో జట్టుకట్టినా పరిస్థితిలో మార్పు రాకపోగా, బీజేపీ మరింత బలహీనపడింది. గత లోక్‌సభ ఎన్నికల్లో ఒంటరిగా పోటీచేసినా 11.2 శాతం ఓట్లను సాధిస్తే, శాసనసభ ఎన్నికల నాటికి తన బలం నాలుగు స్థానాల నుంచి ఒక్క స్థానానికి పడిపోవడమే కాదు, ఓటుబ్యాంకు కూడా 2.9 శాతానికి పరిమితమై నిరాశపరిచిందనే చెప్పాలి.

కేరళ ఎన్నికల్లో మొదటిసారి బీజేపీ మూడు శాసనసభ స్థానాలు గెలిచినప్పటికీ, లోక్‌సభ ఎన్నికల నాటి 16.6 శాతం ఉన్న ఓటుబ్యాంక్ నేడు 11.4 శాతానికి పడిపోయింది. దక్షిణాదిలో ఎన్నికలు జరిగిన కేరళ, తమిళనాడు, పుదుచ్చేరిలలో 404 శాసనసభ స్థానాలు ఉంటే, బీజేపీ గెలిచింది ఎనిమిది మాత్ర మే. దక్షిణాదిలో బలం పెంచుకోవాలనే బీజేపీ ఆశలపై ఈ ఎన్నికలు నీళ్లు చల్లాయి. తమ రాజకీయ వ్యూహాలకి దక్షిణాది కోరుకుడు పడని విషయం బీజేపీని వేధిస్తుం దనే చెప్పాలి. 

బలహీనపడిన ఇండియా కూటమి

ఇటీవల కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు ప్రత్యేక సమావేశాలలో ప్రవేశపెట్టిన మహి ళా- డీలిమిటేషన్ బిల్లు సభ ఆమోదం పొం దకుండా ఇండియా కూటమికి చెందిన 238 మంది లోక్‌సభ సభ్యులు బిల్లుకి వ్యతిరేకంగా ఓటు వేసి తమ ఐక్యతను ప్రదర్శించారు. కానీ, లోక్‌సభలో 4వ, 5వ అతిపెద్ద పార్టీలైన టీఎంసీ బెంగాల్ శాసనసభ ఎన్నికలలో, డీఎంకే తమిళనాడు శాస నసభ ఎన్నికలలో ఓడి, అధికారాన్ని కోల్పోవడంతో ఇండియా కూటమి బలహీనపడే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇండియా కూటమిలో భాగస్వామ్య పక్షాలైన ఆప్ ఢిల్లీ శాసనసభ ఎన్నికలలో, ఆర్జేడీ బీహార్ ఎన్నికలలో, ఇప్పుడు టీఎంసీ, డీఎంకేలు కూడా ఓడిపోవడంతో ఇండి యా కూటమి రాజకీయంగా బలహీనపడింది. కేరళలో కాంగ్రెస్ పార్టీ గెలిచినా అసోంలో దారుణమైన ఓటమి, భాగస్వా మ్య పక్షాల ఓటమితో కాంగ్రెస్ కలవరపడుతోంది. దశాబ్దాలుగా డీఎంకేతో ఉన్న అనుబంధాన్ని తెంచుకొని తమిళనాడులో టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకి కాంగ్రెస్ మద్ద తు ఇవ్వటంతో కాంగ్రెస్ నమ్మకద్రోహం చేసిందని, పొత్తు ధర్మాన్ని పాటించలేదని డీఎంకే విమర్శిస్తోంది.

ఇండియా కూటమిలో కొనసాగకపోవచ్చనే సంకేతాలు డీఎంకే ఇస్తోంది. అలాగే రాబోయే పంజా బ్, ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో ఆమ్ ఆద్మీ, సమాజ్‌వాదీ పార్టీలు గెలవకపోయినా ఇండియా కూటమి విచ్ఛిన్నమ య్యే అవకాశాలు లేకపోలేదు. బంగాల్‌లో బీజేపీ గెలుపు, తమిళనాడులో టీవీకే గెలు పు రెండు రాజకీయంగా పరస్పర విరుద్ధంగా కనిపిస్తున్నా, ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ఒక్క దక్షిణాదిలో తప్ప దేశంలో బీజేపీని రాజకీయంగా మరింత బలోపేతం చేశాయని చెప్పక తప్పదు.

 వ్యాసకర్త సెల్: 9885465877