7 June, 2026 | 4:00 PM

విద్యుత్ సరఫరా పునరుద్ధరణలో విశేష సేవలు అందించిన లైన్‌మ్యాన్ దేవ్ సింగ్ కు ఉత్తమ ఉద్యోగి అవార్డు

02-06-2026 06:25 PM

టేకులపల్లి,(విజయక్రాంతి): తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని టీజీఎన్‌పీడీసీఎల్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో టేకులపల్లి మండలం బొమ్మనపల్లి ఆపరేషన్ సెక్షన్‌లో లైన్‌మ్యాన్‌గా విధులు నిర్వహిస్తున్న బి.దేవ్ సింగ్ కు “ఉత్తమ ఉద్యోగి” అవార్డు అంద చేశారు. గత మూడు సంవత్సరాలుగా 11 కేవీ ముత్యాలంపాడు ఫీడర్ (190 కిమీ), 11 కేవీ ముత్యాలంపాడు ఫీడర్ (30 కిమీ) పరిధిలో విద్యుత్ సరఫరా నిర్వహణ బాధ్యతలను ఆయన సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు.

గాలి తుఫానులు, భారీ వర్షాలు, చెట్లు విరిగి పడటం వంటి విపత్కర పరిస్థితుల్లో ఏర్పడిన విద్యుత్ అంతరాయాలను తొలగించేందుకు రాత్రింబవళ్లు శ్రమిస్తూ అనేక సందర్భాల్లో 48 నుంచి 72 గంటల పాటు విశ్రాంతి లేకుండా పనిచేసి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. ప్రజలకు నిరంతరాయ విద్యుత్ సరఫరా అందించడంలో చూపిన అంకితభావం, సేవా తత్పరతను గుర్తించిన శాఖ అధికారులు డీఈ, ఏడీఈ, ఏఈల సిఫార్సు మేరకు ఆయనను ఉత్తమ ఉద్యోగి అవార్డుకు ఎంపిక చేశారు. వరంగల్‌లో జరిగిన టీజీ ఎన్పీడీసీఎల్ కంపెనీ స్థాయి కార్యక్రమంలో ఈ అవార్డును అందజేశారు. అవార్డు అందుకున్న బి.దేవ్ సింగ్ కు సహోద్యోగులు, విద్యుత్ శాఖ అధికారులు, స్థానిక ప్రజలు అభినందించారు.