యాదాద్రిలో భక్తులకు మెరుగైన సౌకర్యాలు

18-04-2024 02:33:11 AM

l వేసవి దృష్ట్యా చలువ పందిళ్లు ఏర్పాటు 

l అందుబాటులోకి తాగునీరు


యాదాద్రి భువనగిరి, ఏప్రిల్ 17 (విజయక్రాంతి): యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి ఆలయానికి వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు అధికారు లు చర్యలు చేపట్టారు. వేసవి నేపథ్యంలో భక్తులు ఎండబారిన పడకుండా చలువ పందిళ్లను ఏర్పాటు చేశారు. దాతల సహకారంతో ఆలయ ఈఓ భాస్కర్‌రావు కొం డపైన జర్మన్ వాటర్ ప్రూఫ్ షెడ్ వేయించారు. అలాగే క్యూ కాంప్లెక్స్ హాల్‌లో తాగునీరు, మూత్రశాలలు, ఏసీ ఏర్పాటు చేయడంతో పాటు భక్తులు నిద్రించడానికి డార్మెటరీ హాల్‌లో తాత్కాలిక ఏర్పాట్లు చేశారు. ఆసక్తి ఉన్న భక్తులు స్వామివారికి సేవ చేసేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో సేవా సమితి సభ్యులను నియమించాలని నిర్ణయించారు.

భక్తులకు నీడ కోసం.. 

ఆలయానికి వచ్చిన భక్తులు దర్శనం అనంతరం బయటకు వచ్చి సేద తీరడానికి సౌకర్యం లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. సమస్యను గుర్తించిన అధికారులు ఆలయ ఉత్తర ద్వారం వైపు జర్మన్ రెయిన్ వాటర్ ప్రూఫ్ షెడ్ ఏర్పాటు చేశారు. సుమారు 3 వేలమంది పైగా సేద తీరడానికి ఏర్పాట్లు చేశారు. అవసరమైతే రాత్రి సమయంలో నిద్రించేలా వీలు కల్పించారు.

డిజిటల్ స్క్రీన్ ఏర్పాటు..

ఆలయానికి వచ్చే భక్తుల కోసం డిజిటల్ స్క్రీన్ ఏర్పాటు చేయనున్నట్లు ఈఓ భాస్కర్ రావు తెలిపారు. తిరుమల తరహాలో అన్ని భాషల్లో దేవాలయం పరిసర ప్రాంతంలో బోర్డుల ఏర్పాటు చేస్తామని చెప్పారు. డార్మెటరీ రూమ్‌ల్లో టీవీలను ప్రణాళికా  బద్ధంగా ఏర్పాట్లు చేస్తానని, నృసింహ జయంతి ఉత్సవాల లోపు పనులు పూర్తి చేస్తామని వెల్లడించారు.  

ఆలయంలో సెల్ ఫోన్ల నిషేధం..

ఆలయానికి శని, ఆదివారాల్లో భక్తుల తాకిడి అధికంగా ఉంటుంది. ఈ సమయంలో స్థానికంగా ఉండేవారు తమ పలుకుబడి ఉపయోగించి బంధువులను, స్నేహితులను వీఐపీ దర్శనానికి తీసుకుపోతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ కారణంగా సామాన్య భక్తులు గంటల తరబడి క్యూలైన్‌లో వేచి ఉండాల్సి వస్తుండటంతో ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే ఆలయంలో ఫొటోలు తీయడం వంటివి చేస్తున్నారు. ఈ ఇబ్బందుల దృష్ట్యా ఆలయంలోకి పూర్తిస్థాయిలో సెల్ ఫోన్లు నిషేధించినట్లు సమాచారం.