11-08-2025 12:00:00 AM
జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి
నల్లగొండ టౌన్, ఆగస్టు 10: నల్గొండ ప్రభుత్వ ప్రధానాస్పత్రి ద్వారా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి చెప్పారు.ఆదివారం ఆమె ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. క్యాజువాలిటీ, ఐసీయూ, ఏ ఎం సి యు,సర్జికల్ వార్డు, మెడికల్ వార్డ్, రేడియాలజీ, తదితర విభాగాలను తనిఖీ చేసి డాక్టర్లు, నర్సులతో మాట్లాడి ఆసుపత్రి ద్వారా అందిస్తున్న వైద్య సేవల పై ఆరా తీశారు.
ఐసీయూ, రేడియాలజీ, తదితర విభాగాలలో ఎంత మంది పేషెంట్స్ ఉన్నారని? ఐ సి లో ఎన్ని బెడ్లు ఉన్నాయని ?అడిగి తెలుసుకున్నారు. సీజనల్ వ్యాధులతో ప్రధాన ఆస్పత్రికి వస్తున్న వారి వివరాలను సైతం జిల్లా కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.రేడియాలజీ విభాగం ద్వారా రోగులకు అందిస్తున్న వైద్య సేవలపై ఆరా తీశారు.
రేడియాలజీ విభాగం దూరంగా ఉన్నందున నడవలేని పేషెంట్లకు మొబైల్ ఎక్స్ రే యూనిట్ ద్వారా ఎక్స్ రే తీయించడం జరుగుతుందని, నడవగలిగే వారిని వీల్ చైర్ మీద రేడియాలజీ కి తీసుకెళ్తున్నట్లు డాక్టర్లు తెలిపారు. అన్ని విభాగాలు పరిశీలించిన తర్వాత మందు లు, వైద్య సేవలు, టెస్టులు, ఇతర పరీక్షల పై జిల్లా కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు.
అనంతరం మాట్లాడుతూ ప్రభుత్వ ప్రధానాస్పత్రిలో అవసరమైన అన్ని వైద్య పరికరాలు, సేవలు అందుబాటులో ఉన్నాయని, ప్రజలు వీటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు . పరీక్షల నిర్వహణలో సైతం ఎలాంటి నిర్లక్ష్యం,ఇబ్బంది లేకుండా రోగులకు అవసరమైన అన్ని పరీక్షలు నిర్వహించాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సూపరింటిండెంట్ డాక్టర్ శ్రీకాంత్ వర్మ, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఈశ్వర్ ,ఆర్ ఎం ఓ కిరణ్ కుమార్, టి ఎస్ ఎం ఐడిసి రాజశేఖర్, జితేందర్, తదితరులు ఉన్నారు .