18-02-2026 01:42:36 AM
బయో ఏషియా బయో వరల్డ్‌గా మారుతోంది
3ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగడమే లక్ష్యం
హైదరాబాద్, ఫిబ్రవరి 17 (విజయక్రాంతి) : 23 సంవత్సరాల క్రితం బయో ఏషియా ప్రారంభమైనప్పుడు హైదరాబాద్ అంటే చార్మినార్, బిర్యానీ, ఔషధ తయారీ, సాఫ్ట్‌వేర్ నగరం అన్న గుర్తింపు ఉండేదని, ప్రస్తుతం హైదరాబాద్ ప్రపంచ వ్యాక్సిన్ తయారీ కేంద్రంగా నిలిచిందని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. దూరదృష్టి గల నాయకత్వం, స్పష్టమైన విధానాలు, నైపుణ్యంతో కూడిన మానవ వనరులు, ప్రతిష్టాత్మక విద్యాసంస్థల బలాల ఆధారంగా హైద రాబాద్ గ్లోబల్ కెపబిలిటీ సెంటర్లకు, పరిశోధన, డిజైన్‌లో విశిష్టతకు ప్రపంచ కేంద్రంగా ఎదిగిందన్నారు.
మంగళవారం హైటెక్స్‌లో బయో ఏషియా సదస్సును మంత్రి శ్రీధర్‌బాబుతో కలిసి సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభిం చారు. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ రెండేళ్లలోనే, జీవవిజ్ఞాన రంగంలో రూ. 73,000 కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయని తెలిపారు. కొద్ది వారాల క్రితం దావోస్‌లో మా కొత్త లైఫ్ సైన్సెస్ పాలసీని ప్రకటించామని, జీనోమ్ వ్యాలీని విస్తరించామని, ప్రపంచ స్థాయి పరిశోధన, ఆవిష్కరణ లకు ‘వన్-బయో’ను ప్రారంభించామని పేర్కొన్నారు.
గ్రీన్ ఫార్మా సిటీని వేగవంతం చేశామని, అనేక గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లను ఆహ్వానించామని వెల్లడించారు. ఇది సాధారణ అభివృద్ధి కాదని, ఇది దృఢమైన దృష్టి ఫలితమన్నారు. దానికి ప్రత్యక్ష సాక్ష్యం బయో ఏషియా 2026 సదస్సు అని, ఈ సభను చూస్తుంటే నేను గర్వంగా చెప్పగలనని అన్నారు. బయోఏషియా తన పేరును దాటి, బయో-వరల్డ్‌గా మారుతోందని, ఈ సదస్సుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న 500 ప్రముఖ సంస్థలకు చెందిన 4,000 మందికి పైగా ప్రతినిధులు హాజరయ్యారని చెప్పారు.
ఫార్మా, బయోసైన్సెస్, బయోటెక్, బల్క్ డ్రగ్స్, వ్యాక్సిన్లు, ఆరోగ్య రంగాల్లో ప్రముఖులు, బిజినెస్ లీడర్స్ మనతో ఉన్నారని, సైన్స్, ఏఐ, బయోటెక్ వంటి రంగాల్లో ప్రముఖులను కలిసినప్పుడు అసాధారణమైన ఫలితాలు వస్తాయని తెలిపారు. హైద రాబాద్‌లో జరుగుతున్న బయో ఏషియా సదస్సు దావోస్‌లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం లాంటి అంతర్జాతీయ గుర్తింపు పొందుతుందనే నమ్మకం ఉందన్నారు.
‘ల్యాబొరేటరీ ఆఫ్ ది ఫ్యూచర్’గా హైదరాబాద్ : మంత్రి శ్రీధర్ బాబు
ఫార్మా రాజధానిగా పేరొందిన హైదరాబాద్ ను ‘ల్యాబొరేటరీ ఆఫ్ ది ఫ్యూచర్’గా తీర్చిదిద్దాలన్నదే తమ ప్రభుత్వ సంకల్పమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పేర్కొన్నారు. 2030 నాటికి లైఫ్ సైన్సెస్ రంగంలో 25 బిలియన్ డాలర్ల పెట్టుబడులను రాష్ట్రానికి తీసుకొచ్చి... కొత్తగా 5 లక్షల మంది యువతకు ఉపాధి అవకాశాలను కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.
ఈ దశాబ్దం చివరి నాటికి ప్రపంచంలోని టాప్ 3 లైఫ్ సైన్సెస్ క్లస్టర్లలో రాష్ట్రాన్ని ఒకటిగా నిలిపేందుకే ‘తెలంగాణ నెక్స్ట్ - జెన్ లైఫ్ సైన్సెస్ పాలసీ(2026- 2030)’ రూపొందించామని వివరించారు. ఇప్పటి వరకు లైఫ్ సైన్సెస్ రంగంలో సప్లు కోసం మాత్రమే మన వైపు చూసిన ప్రపం చం ఇప్పుడు ప్రస్తుతం ఈ రంగం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారాల కోసం చూస్తోందన్నారు. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకునేలా తెలంగాణను అన్ని రకాలుగా సిద్ధం చేస్తున్నామన్నారు.
తెలంగాణ స్కూల్ ఆఫ్ లైఫ్ సైన్సెస్, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ద్వారా ఎంఆర్‌ఎన్‌ఏ, జీన్ ఎడిటింగ్, ఏఐ ఆధారిత డ్రగ్ డిస్కవరీ వంటి అత్యాధునిక రంగాల్లో ‘రెడీ టూ వర్క్ ఫోర్స్’ గా ఇక్కడి యువతను తయారు చేస్తున్నామన్నారు. సీబీఆర్‌ఈ గ్లోబల్ లైఫ్ సైన్సెస్ అట్లాస్ (2025) ప్రకారం, బోస్టన్, శాన్ ఫ్రాన్సిస్కో, బీజింగ్, టోక్యో లాంటి గ్లోబల్ హబ్‌ల సరసన నిలిచిన ఏకైక భారతీయ నగరం హైదరాబాద్ అని అన్నారు.
అలాగే గ్లోబల్ మెడికల్ టూరిజం హబ్ గా నూ మార్చేందుకు ప్రత్యేక పాలసీని తీసుకొచ్చామన్నారు. ఏఐ ఆధారిత డ్రగ్ డిస్కవరీ, ఆటోమేషన్ ఇన్ బయోలాజిక్స్ మాన్యుఫాక్చరింగ్, డేటా ఆధారిత ప్రెసిషన్ మెడిసిన్, కంప్యూషనల్ బయాలజీ, బయో మాన్యుఫాక్చరింగ్ 4.0 తదితర రంగాల్లో తెలంగాణతో కలిసి పనిచేసేందుకు ముందుకు రావాలని దిగ్గజ పారిశ్రామికవేత్తలను ఆహ్వానించారు.
అన్ని సందేహాలకూ హైదరాబాదే సమాధానం
తెలంగాణతోపాటు ముఖ్యంగా జీవవిజ్ఞాన రంగంపై మా దృష్టిని మీతో పంచుకుంటానని, ఇటీవల మేము ‘తెలంగాణ రైజింగ్ 2047’ వి జన్‌ను ప్రకటించామని పేర్కొన్నారు. 2034 నాటికి ఒక ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్య వస్థగా ఎదగడం మా లక్ష్యమని స్పష్టం చేశారు. ప్రస్తుత జీవ విజ్ఞాన ధోరణులను చూస్తే పరిశోధన సంస్థలు, కార్పొరేట్లు, స్టార్టప్‌లు, చిన్న మధ్య తరహా సంస్థలు, ప్రభు త్వం మధ్య బలమైన భాగస్వామ్యం అవసరమని చెప్పారు.
మీరు విశ్వసనీయమైన, స్థిరమైన, భవిష్యత్తు కో సం మంచి వాతావరణాన్ని కోరుకుంటున్నారని, దానిని తెలంగాణ అందిస్తుందని, హైదరాబాదే మీ సందేహాలకు సమాధానమని వివరించారు. బల్క్ డ్రగ్స్ నుంచి బయా లజిక్స్ వరకు, తయారీ నుంచి ఆవిష్కరణ వరకు, భారతదేశం నుంచి ప్రపంచ స్థాయి వరకు తెలంగాణ ముందుకు సాగుతోందన్నారు. మే ము కేవలం భారతదేశంలోనే పోటీ పడటం లేదని, ప్రపంచంలోని అగ్రగామి క్లస్టర్లతో పోటీ పడుతున్నా మన్నారు.
హైదరాబాద్ ఇప్పటికే గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లకు ప్రాధా న్య గమ్యస్థానంగా మారిందని తెలిపారు. ఇప్పుడు మనం కలిసి దీన్ని సమగ్ర జీవ విజ్ఞాన రంగానికి ప్రపం చ కేంద్రంగా తీర్చిదిద్దుదామని పిలుపునిచ్చారు. ఇక్కడ పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు. మనమంతా కలిసి పనిచేస్తే హైదరాబాద్ ప్రపంచ వ్యాక్సిన్ రాజధానిగా ఉన్న స్థితి నుంచి ప్రపంచ జీవవిజ్ఞాన రాజధానిగా ఎదుగుతుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రపంచానికి తెలంగాణ సిద్ధంగా ఉందని, తెలంగాణ అంటే వ్యాపారం.. తెలంగాణ ఎదుగుదలతో మీరు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.