వాస్తవ ఘటనల కళాంకి భైరవుడు
‘కళాంకి భైరవుడు’ ఓ విభిన్నమైన గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన మిస్టికల్ థ్రిల్లర్. చేతబడులు, క్షుద్ర పూజలు, నిజ జీవితంలో జరిగిన కొన్ని ఆశ్చర్యకర సంఘటనల ఆధారంగా రూపొందిన చిత్రమిది. హరిహరన్ వీ దర్శకత్వంలో గాయత్రీ ప్రొడక్షన్స్, రచ్చమల్ల బ్రదర్స్ బ్యానర్లపై కేఎన్ రావు, రచ్చమల్ల శ్రీనివాసరావు నిర్మించారు. పీఆర్ సంగీతం అందించారు. ఈ చిత్రంలో రాజశేఖర్ వర్మ ప్రధాన పాత్రలో నటించగా, రితిక, పూజ కిరణ్, భవ్యశ్రీ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
ఈ మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్ హైదరాబాద్‌లో నిర్వహించగా, టాలీవుడ్ దర్శకుడు సాయి రాజేశ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ వేడుకలో హీరో రాజశేఖర్‌వర్మ మాట్లాడుతూ.. “కళాంకి భైరవుడు’ ప్రతి ఒక్కరినీ ఆకట్టుకునే చిత్రం అవుతుందని నమ్ముతున్నా” అన్నారు. హీరోయిన్ రితిక మాట్లాడుతూ.. “ఈ సినిమాలో నేను నటించిన ‘శ్రీదేవి’ పాత్ర నాకు ఎంతో ప్రత్యేకం. ఈ సినిమా ప్రేక్షకులను తప్పకుండా ఆకట్టుకుంటుంది” అని తెలిపారు. ‘
ఇది తప్పకుండా ఒక విభిన్నమైన చిత్రంగా నిలుస్తుంద’ని మరో కథానాయిక భవ్యశ్రీ చెప్పారు. దర్శకుడు హరిహరన్ మాట్లాడుతూ.. “నా జీవితంలో నేను ప్రత్యక్షంగా ఎదుర్కొన్న అనేక వాస్తవ సంఘటనలే ఈ సినిమాను రూపొందించడానికి ప్రేరణగా నిలిచాయి.
నా స్వీయ అనుభవాలతో ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించేలా ఈ చిత్రాన్ని తెరకెక్కించాం” అని తెలిపారు. ‘ఈ సినిమా అవుట్‌పుట్‌పై మాకు పూర్తి నమ్మకం ఉంది. మా చిత్రాన్ని ప్రతిఒక్కరూ ఆదరిస్తారని కోరుకుంటున్నాన’ని నిర్మాత కేఎన్ రావు అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో సంగీత దర్శకుడు పీఆర్‌తోపాటు చిత్రబృందం కూడా మాట్లాడారు.






