భక్తజన సంద్రంగా యాదాద్రి
యాదాద్రి భువనగిరి, జూన్ 9 (విజయక్రాంతి): యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకునేందుకు ఆదివారం భక్తులు పోటెత్తారు. సెలవు దినం కావడం, విద్యాసంస్థలు పునః ప్రారంభం కానుండటంతో భారీగా భక్తులు తరలివచ్చారు. క్యూలైన్లు, ప్రసాదాల కాంప్లెక్స్ వద్ద రద్దీ కనిపించింది. ఈ ఒక్కరోజే సుమారు 60 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారని ఆలయ అధికారులు అంచనా వేశారు. ఒక్కరోజే ఆలయానికి రూ.83,19,056 ఆదాయం వచ్చినట్లు ఆలయ కార్యనిర్వహణ అధికారి భాస్కర్‌రావు తెలిపారు.
లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని మధుర కవి వనామామలై రామానుజ జీయర్‌స్వామి సందర్శించారు. ఆలయ ప్రధానార్చకులు, అధికారులు ఆయనకు మంగళవాద్యాల నడుమ సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. నల్లగొండ జిల్లా చింతపల్లిలోని సాయిబాబా మందిర వార్షికోత్సవం పురస్కరించుకుని అర్చకులు, నిర్వాహకులు ఘనంగా యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి కల్యాణ మహోత్సవం నిర్వహించారు. మందిర కమిటీ అభ్యర్థన మేరకు యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఉత్సవ మూర్తులను అర్చకులు మనోహరంగా అలంకరించారు.






