11 July, 2026 | 10:37 PM

'పేదల కన్నీళ్లు తుడవడమే ప్రభుత్వ లక్ష్యం'

11-07-2026 09:24 PM

- సీఎంఆర్ఎఫ్, కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీలో మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి

ఖమ్మం,(విజయక్రాంతి): ఆపదలో ఉన్న ప్రతి నిరుపేద కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని, పేదల కన్నీళ్లు తుడవడమే తమ ప్రభుత్వ లక్ష్యమని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ఖమ్మం రూరల్ మండలం, ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని 129 మంది లబ్ధిదారులకు మంజూరైన రూ.35,91,500 విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులతో పాటు, ఖమ్మం రూరల్ మండలానికి చెందిన మూడు కళ్యాణలక్ష్మి చెక్కులను శనివారం ఖమ్మంలోని తన క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు ఆయన పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ... నిరుపేదలకు వైద్య ఖర్చుల భారం కాకూడదనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి సహాయ నిధిని వేగంగా అందిస్తున్నామన్నారు. అలాగే ఆడబిడ్డల పెళ్లిళ్లకు కళ్యాణలక్ష్మి పథకం ఎంతో ఆసరాగా నిలుస్తోందని చెప్పారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు సకాలంలో అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రి క్యాంపు కార్యాలయ ఇన్‌చార్జి తుంబూరు దయాకర్ రెడ్డి, స్థానిక కాంగ్రెస్ నాయకులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.