భూకబ్జాలపై ఉక్కుపాదం
- స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటుతాం
మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి
కరీంనగర్, జూన్ 9 (విజయక్రాంతి): కరీంనగర్ జిల్లా మానకొండూర్ నియోజకవర్గ పరిధిలో భూకబ్జాలపై ఉక్కుపాదం మోపుతామని, బీఆర్‌ఎస్ హయాంలో జరిగిన భూ ఆక్రమణలను వెలికితీస్తామని కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ స్పష్టంచేశారు. ఆదివారం తిమ్మాపూర్‌లోని క్యాంపు కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గంలో బీఆర్‌ఎస్ పాలనలో అసైన్డ్ భూములు, ప్రభుత్వ భూములు కబ్జాకు గురయ్యాయని, మండలాల వారీగా వివరాలు సేకరిస్తున్నామని తెలిపారు. కబ్జాదారులపై చర్యలు తీసుకోవడంతోపాటు ప్రభుత్వ భూమిని రక్షించేవిధంగా ముందుకెళ్తామని చెప్పారు.
బెజ్జంకి మండలం రంగంపేటలో మాజీ ఎమ్మెల్యే రసమయికి సంబంధించిన భూ వ్యవహారంలో ప్రభుత్వం సర్వే చేయనుందని, ఆక్రమణ ఉన్నట్టు తేలితే చర్యలు తప్పవని అన్నారు. జిల్లాలో పార్టీని బలోపేతం చేసే విధంగా మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి కృషి చేస్తున్నామని తెలిపారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తాచాటే విధంగా పార్టీని బలోపేతం చేస్తామని తెలిపారు. పనిచేసే కార్యకర్తలకు తప్పకుండా గుర్తింపు ఉంటుందని, స్థానిక సంస్థల ఎన్నికల్లో పనిచేసే వారికే టికెట్లు ఇస్తామని స్పష్టంచేశారు.






