అక్రమ పెన్షన్లు రద్దు చేస్తం
- ప్రజా ప్రభుత్వంలో పైరవీలకు తావు లేదు
రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి
పాలేరు, జూన్9: ప్రజా ప్రభుత్వంలో పైరవీలకు తావులేదని, గత ప్రభుత్వ హ యాంలో అక్రమంగా పొందిన పెన్షన్లు రద్దు చేస్తామని రెవెన్యూ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి స్పష్టంచేశారు. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలంలోని పలు గ్రామాల్లో ఆదివారం మంత్రి పర్యటించారు. ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. ఈసందర్బంగా పొంగులేటి మాట్లాడుతూ.. రాబోయే మూడేండ్లలో పాలేరు నియోజకవర్గంలోని పేదలందరికీ ఇండ్లు ఇప్పిస్తానని తెలిపారు. త్వరలో అర్హులైన లబ్ధిదారులకు తీపి కబురు చెప్తా మన్నారు. రెవెన్యూ అధికారులు గ్రామాల్లో సభలు నిర్వహించి సమస్యలు పరిష్కరించాలని, పరిష్కారం కాని భూసమస్యలు ఉంటే తన దృష్టికి తేవాలని ఆదేశించారు. నివాస గృహాల మీదుగా ఉన్న హైటెన్షన్ విద్యుత్తు లైన్లను రెండు నెలల్లో మార్పిస్తామని హామీ ఇచ్చారు. ఖరీఫ్ సాగుకు చివరి భూముల వరకు నీళ్లు వచ్చే విధంగా అధికారులు పర్యవేక్షించాలని ఆదేశించారు.






