నిప్పులు కక్కుతున్న భానుడు

02-05-2024 01:59:46 AM

రాష్ట్రంలో కొనసాగుతున్న ఉష్ణోగ్రతల ఉధృతి

హైదరాబాద్, మే 1 (విజయక్రాంతి): రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు ఏ మాత్రం తగ్గడం లేదు. బుధవారం కూడా భానుడు నిప్పులుకక్కాడు. ఉమ్మడి నల్గొండ, కరీంనగర్ జిల్లాల్లో 46 డిగ్రీలకు తగ్గకుండా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాష్ట్రంలో ఏప్రిల్ 30న నమోదైన ఉష్ణోగ్రతలు పదేళ్లలో ఇదే తేదీలో నమోదైన ఉష్ణోగ్రతల్లో గరిష్టం కావడం గమనార్హం. ఉమ్మడి నల్గొండ, కరీంనగర్, వరంగల్ జిల్లాలకు వాతావరణశాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. గత కొద్ది రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా 42 డిగ్రీలకు తగ్గకుండా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మే నెలలో అత్యధికంగా 48 నుంచి 49 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. గురువారం కూడా రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో వడగాలులు వీస్తాయని వెల్లడించారు. రానున్న మూడు రోజులు గ్రేటర్ వ్యాప్తంగా 41 నుంచి 43 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు కానుండగా, అత్యల్పంగా 28 నుంచి 30 డిగ్రీలు నమోదవుతాయని అధికారులు తెలిపారు.