నిప్పులు చెరుగుతున్న భానుడు

02-05-2024 12:10:00 AM

భానుడు చండ్రనిప్పులు కురిపిస్తున్నాడు. అనేక ప్రాంతాల్లో వడగాడ్పుల కారణంగా జనం బయటికి రావడానికే భయపడిపోతున్నారు. ఏప్రిల్ నెల చివరి నాటికే ఈ పరిస్థితి ఇలా ఉంటే ఇక మే, జూన్ నెలల్లో ఎలా ఉంటుందోనని భయపడిపోతున్నారు. తాగునీటి కటకట కూడా మొదలయింది. కొన్ని ప్రాంతాల్లో ్లమంచినీటి కోసం ట్యాంకర్లు లాంటి వాటిపై ఆధారపడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మండే ఎండల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించడం పార్టీలకు, నేతలకు ప్రాణ సంకటంగా తయారైంది.

ఈ ఏడాది భానుడు మండి పోతున్నాడు. తెలుగు రాష్ట్రాలతో పాటుగా దేశంలోని అన్ని ప్రాంతాపై కన్నెర్ర చేస్తున్నాడు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఉష్ణోగ్రతలు పెరిగి పోతున్నాయి. గత రెండు రోజులుగా తెలుగు రాష్ట్రాల్లోని అనేక ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల సెల్సియస్‌ను దాటేశాయి. పగలు పది గం టలకే వడగాలులు వీస్తుండడంతో జనం బయటికి రావడానికే భయపడుతున్నారు. ఒకవేళ అత్యవసర పనుల మీద వచ్చినా ఎండ తాకిడిని తట్టుకోలేక అల్లాడిపోతున్నారు. వయసులో ఉన్నవాళ్ల సంగతే ఇలా ఉంటే వయోవృద్ధులు, చిన్న పిల్లల సంగతి చెప్పనవసరం లేదు. సాధారణం గా ఏప్రిల్ నెలలో ఉష్ణోగ్రతలు పెరగడం, వేసవి ప్రభావం కనిపించడం ప్రారంభమవుతుంది. కానీ, ఈసారి మార్చి ప్రారంభం నుంచే ఎండలు వేసవిని తలపించడం మొదలయింది. క్రమంగా ఏప్రిల్ మొదటి వారానికి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలను దాటేశాయి.భారత వాతావరణ విభాగం కూడా ఈ ఏడాది ఎండలు మండిపోతాయని ముందే హెచ్చరించింది. సాధారణం కన్నా నాలుగైదు డిగ్రీలు ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయని కూడా పేర్కొంది. 

ఇప్పటికే వడదెబ్బకు తెలుగు రాష్ట్రాల్లో కొంత మంది మృత్యువాతపడ్డట్లు వార్తలు కూడా వచ్చాయి. మరోవైపు ఎండ తీవ్రత పెరిగే కొద్దీ తాగునీటికి కటకట కూడా మొదలైంది. ప్రధాన జలాశయాలయిన నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల్లో నీటిమట్టాలు రోజురోజుకు పడిపోతున్న్నాయి. జంటనగరాలతోపాటు తెలుగు రాష్ట్రాల్లోని అనేక గ్రామాలకు తాగునీరును అందించే నాగార్జునసాగర్‌లో నీటిమట్టం డెడ్ స్టోరే జ్ స్థాయికి పడిపోవడంతో అత్యవసర పంపింగ్ సైతం మొదలుపెట్టారు. ఇక  మిగతా జలాశయాల పరిస్థితికూడా ఆందోళనకరంగానే ఉంది. 

పరిస్థితి మరింత తీవ్రమవుతుందా?

ఎండవేడిమికి రోజుకు వెయ్యి క్యూసెక్కుల చొప్పున నీటి మట్టాలు తగ్గిపోతున్నట్లు అధికారులు చెబుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో సాధారణంగా రుతుపవనాలు జూన్ మధ్యలో కానీ మామూలుగా ప్రవేశించవు. వర్షాలు పుంజుకోవాలంటే మరో రెండు వారాలయినా ఆగాల్సి ఉంటుంది. అంటే, దాదాపు రెండు నెలలపాటు వేసవి తీవ్రత కొనసాగే ప్రమాదం ఉంది. ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే రానున్న రోజుల్లో మరీ దారుణమైన పరిస్థితులు ఎదురయ్యే ప్రమాదం ఉంది.ఆంధ్రప్రదేశ్‌లో కూడా వడగాలుల తీవ్రత ఎక్కువగానే ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. రెండు రాష్ట్రాలమధ్య రాకపోకలు నిత్యం కొనసాగుతుండే నేపథ్యంలో ప్రయాణాలు చేయడానికే ప్రజలు భయపడుతున్నారు. ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశమంతటా కూడా ఇదే పరిస్థితి ఉంది. 

పశ్చిమ బెంగాల్‌లో సోమవారం దేశంలోనే అత్యధికంగా 47 డిగ్రీ లకుపైగా ఉష్ణోగ్రత నమోదయింది. ఉత్తరప్రదేశ్ సహా ఉత్తరాది రాష్ట్రాల్లోనూ భాను డి ప్రతాపం తీవ్రంగానే ఉంది. మండే ఎండలమధ్య సార్వత్రిక ఎన్నికల ప్రచారం కొనసాగించాల్సిన పరిస్థితి రావడంతో రాజకీయ పార్టీలు బెంబేలెత్తి పోతున్నా యి. ప్రచారం కోసం జాతీయ స్థాయి నేత లు వస్తున్నా వారి సభలకు జన సమీకరణ చేయడం నేతలకు పెద్ద తలనొప్పిగా మారింది. మరీ, మిట్టమధ్యాహ్నం వేళల్లో సభలు పెడితే జనం రారేమోనన్న భయం తో సాయంత్రం వేళ ఏర్పాటు చేస్తున్నారు. ప్రచారం సంగతి సరే, పోలింగ్ సమయం లో ఓటు వేయడానికి జనం ఎక్కడ రాకుం డా పోతారోనన్న భయం కూడా నేతల్లో ఉంది. ఓటింగ్ ఒకటి రెండు శాతం తగ్గినా అభ్యర్థుల తలరాతలు మారిపోయేంత హోరాహోరీ పోటీ ఉన్న తెలుగు రాష్ట్రాల్లో అన్ని ప్రధాన పార్టీలకు ఎండల భయం పట్టుకుంది. 

ఎల్‌నినో ప్రభావం

వేసవి తీవ్రత పెరగడం అనేది ఈ ఏడా ది కొత్తగా మొదలు కాలేదు. గత కొన్ని సంవత్సరాలుగా ప్రతి ఏటా వేసవి ఉష్ణోగ్రతలు పెరుగుతూనే ఉన్నాయి. ఈ ఏడాది  వేసవి తీవ్రత ఇంకా ఎక్కువగా ఉంటుంద ని, భారత్, బంగ్లాదేశ్‌సహా ఆసియా దేశా ల్లో ఉష్ణోగ్రతలు అసాధారణ స్థాయిలో ఉండే ప్రమాదం ఉందని ఐఎండితోపాటు అంతర్జాతీయ వాతావరణ సంస్థలు ముం దే హెచ్చరించాయి. ఎల్‌నినో ప్రభావం ముగిసే సమయంలో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండడం సహజమేనని వాతావరణ నిపుణులు అంటున్నారు. గతంలో ఎన్న డూ లేనంతగా ఉష్ణోగ్రతలు ఉండడానికి ప్రకృతి సహజమైన పరిణామాలతోపాటు మానవ కల్పిత తప్పిదాలు కూడా తోడవుతున్నాయి. 

కనిపించని పచ్చదనం

గతంలో పల్లెలు, పట్నాలు అన్న తేడా లేకుండా ఎక్కడ చూసినా చెట్టుచేమలతో పచ్చదనం కనిపించేది. కానీ, ఇప్పుడు పట్టణాలు, నగరాలు అన్నీ కాంక్రీట్ జంగిల్స్ లాగా మారిపోతున్నాయి. కాంక్రీట్ కట్టడాల కోసం చల్లని నీడనిచ్చే వేలాది చెట్ల ను నరికేసే పరిస్థితులు వచ్చాయి.  దీని దుష్పరిణామాల గురించి ఆలోచించని పాలకులు, అధికారులు బహుళ అంతస్తు ల భవనాలకు ఇష్టారాజ్యంగా అనుమతు లు ఇచ్చేస్తున్నారు. ఫలితంగా ఇప్పుడు నగరాల్లో మండు వేసవిలో తలదాచుకో వడానికి కాస్త నీడ కూడా కనిపించని పరిస్థితులు ఏర్పడ్డాయి. కొన్ని ప్రాంతాల్లో అకాల వర్షాలు, వరదలు, మరికొన్ని ప్రాం తాల్లో కరవు పరిస్థితులకు కారణం ప్రకృతి విధ్వంసమేనని నిపుణులు హెచ్చరిస్తున్నా రు.

ఈ విపత్తులు అనుభవంలోకి వచ్చిన తర్వాత ఆలస్యంగా మేల్కొన్న పాలకులు ఇప్పుడు ఏటా మొక్కలు నాటే కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపడుతున్నారు. అలా నాటిన మొక్కల్లో ఎన్ని బతికి బట్ట కడుతున్నాయనే విషయాన్ని మాత్రం పట్టించుకో వడం లేదు. ఫలితంగా నాటిన మొక్కలు చెట్టుగా ఎదగడానికి ముందే గొడ్డలి వేటు కు బలవుతున్నాయి.మరోవైపు భానుడి ప్రతాపానికి తోడు తాగునీటి సమస్యతో జనం అల్లాడి పోతున్నారు. జంటనగరాల వరకు తాగునీటికి పెద్దగా ఇబ్బంది ఎదు రు కాకపోయినప్పటికీ గ్రామీణ ప్రాంతా ల్లో పరిస్థితి  భిన్నంగా ఉంది. మున్సిపల్ నల్లాల వద్ద బిందెల క్యూలు మళ్లీ దర్శనమిస్తున్నాయి. రాబోయే రోజుల్లో ఈ సమ స్య మరింత తీవ్రరూపం దాల్చే ప్రమాదం ఉంది.

అధికారులు ముందే మేల్కొని యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోకపోతే తాగు నీటికోసం కొట్లాటల దృశ్యాలు చూడాల్సి వస్తుంది. మరోవైపు వయోవృద్ధులు, చిన్న పిల్లలు వడదెబ్బ తాకిడికి గురి కాకుండా ఉండడానికి వైద్యులు అనేక సూచనలు చేస్తున్నారు. కానీ, వాటిని పాటించగలిగే స్థితిలో ప్రజలు లేరు. నిత్యం పనులకు వెళ్లకపోతే పూట గడవని స్థితిలో చాలా కుటుంబాలు ఉన్నాయి. పని చేసే చోట ఎండ తీవ్రత నుంచి కాపాడుకునేందుకు కనీస సదుపాయాలు కూడా ఉండ డం లేదు. దాంతో చాలామంది  జ్వరాలు, ఇతర అనారోగ్య సమస్యలతో ఆస్పత్రుల బాట పడుతున్నారు. జేబులు ఖాళీ అవుతున్నాయి తప్ప వారికి ఎలాంటి ఊరట లభించడం లేదు. ఈ పరిస్థితి చాలా సంవత్సరాలుగా ఉన్నా వారి జీవితాల్లో మార్పులు రావడం లేదు. ఫలితంగా ఎప్పటికప్పుడు ఈ వేసవి గడిస్తే చాలనే స్థితిలో ప్రజలు రోజులు వెళ్లదీయాల్సి వస్తోంది.

- కె.రామకృష్ణ, సెల్ : 9908259123