26-01-2026 02:22:54 AM
సీఎం, ఆయన బామ్మర్ది బాగోతం బయటపడొద్దనే ప్రయత్నం
* భట్టి విక్రమార్క ప్రెస్‌మీట్ చూస్తుంటే ఉల్టా చోర్ కొత్వాల్ కో డాంటే అన్న సామెత గుర్తుకొస్తున్నది. బొగ్గు కుంభకోణంపై స్పష్టమైన సమాధానం ఇవ్వకుండా మాటల గారడీతో, నాలుగు కాగితాలు చూపి మసిపూసి మారేడుకాయ చేయాలని చూశారు. సైట్ విజిట్ సర్టిఫికెట్‌పై భట్టి విక్రమార్క అబద్ధాలను వండివార్చారు.
సింగరేణి స్కామ్‌కు ఎవరు బాధ్యులు? ఎంత నష్టం జరిగింది? లబ్ధిపొందిన వారు ఎవరు? ఈ మూడు కీలక ప్రశ్నల్లో ఒక్కదానికైనా భట్టి సమాధానం చెప్పకుండా దాటవేశారు.
- మాజీమంత్రి హరీశ్‌రావు
హైదరాబాద్, జనవరి 25 (విజయక్రాంతి) : ‘సైట్ విజిట్ సర్టిఫికెట్’ కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్ల కోసమా?, కోల్ ఎవాక్యుయేషన్ సిస్టమ్‌ల కోసమా?, స్క్రీనింగ్ లేదా వాషింగ్ ప్లాంట్ల కోసమా? లేదా నిజంగానే ఓబీ (ఓవర్ బర్డన్) రిమూవల్ పనుల కోసమా? అనేది తెలుసుకోవాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు మాజీ మంత్రి హరీశ్‌రావు హితవు పలికారు. సెంట్రల్ మైన్ ప్లానింగ్ అండ్ డిజైన్ ఇన్‌స్టిట్యూట్ లిమిటెడ్ (సీఎంపీడీఐ) సిఫార్సు ఇచ్చిందని భట్టి బయటపెట్టిన డాక్యుమెంట్‌లో సైట్ విజిట్ సర్టిఫి కెట్ ఎటువంటి పనుల కోసం పెట్టారనేది స్పష్టంగా ఉందన్నారు.
అబ్రకదబ్ర చేస్తున్నారని దుయ్యబట్టారు. ‘సైట్ విజిట్ కన్ఫర్మేషన్ సర్టిఫికెట్’ అనేది పరిమిత ప్రాంతాల్లో జరిగే డిజైన్, సరఫరా, ఇన్‌స్టాలేషన్, కమిషనింగ్ పనులకు మాత్రమే వర్తించే సాంకేతిక నిబంధన అని స్పష్టంచేశారు. సైనిక్ స్కూల్ వాళ్లు ఒక టెండర్ పిలిచారని, ఇందులో సప్లు అండ్ ఇన్‌స్టాలేషన్ ఆఫ్ క్లాత్ డ్రైయర్ కోసం సైట్ విజిట్ పెడితే దాన్ని తీసుకొచ్చి సింగరేణి ఓబీ కాంట్రాక్టుకు లింకు పెట్టి చూపడం హాస్యాస్పదమన్నారు.
భట్టి విక్రమార్క చూపించిన ఈ డాక్యుమెంట్‌లో ఎక్కడ కూడా ఓబీ రిమూవల్ కాంట్రాక్టుకు సైట్ విజిట్ సర్టిఫికెట్ ఇవ్వలేదని తెలి పారు. ఓబీ రిమూవల్ కాంట్రాక్టు పద్ధతికి వర్తించని నిబంధనలు చూపించి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయ త్నం చేశారని, గతంలో ఎప్పుడూ కూడా ఓబీ వర్క్స్‌కు సైట్ విజిట్ సర్టిఫికెట్ విధానం లేనేలేదని స్పష్టం చేశారు. ఆదివారం తెలంగాణ భవన్ మీడియా సమా వేశంలో హరీశ్ మాట్లాడారు.
సింగరేణి కుంభకోణంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్నదని, ముఖ్యమంత్రి, ఆయన బావమరిది బాగో తం బయటపడకుండా కాపాడాలని, భట్టి తన 40 ఏళ్ల అనుభవాన్ని ఉపయోగించి విఫల ప్రయత్నాలు చేస్తున్నారని, భట్టి ప్రయత్నం చేస్తున్నారన్నారు. తాను సీఎంతో మాట్లాడతా అని భట్టి అంటున్నారని, అయితే ‘రేవంత్‌రెడ్డి దొంగ, రేవంత్‌రెడ్డి బావమరిది ఈ స్కాంలో మొదటి లబ్ధిదారుడు. సాక్షాత్తు సీఎం ఈ అవినీతికి సూత్రధారి, పాత్రధారి అని చెప్తుంటే... ఇంకా రేవంత్ రెడ్డితో మాట్లాడితే ఏం ప్రయోజనం’ అని హరీశ్ ప్రశ్నించారు.
నిజంగా సీఎంపీడీఐ సిఫార్సు ఓబీ పనులకే అయితే, 2018 నుంచి 2024 వరకు సింగరేణి పిలిచిన వందలాది ఓబీ టెండర్లలో ఈ షరతు ఒక్కసారి కూడా ఎందుకులేదని, 2018 నుంచి 2024 వరకు ప్రతి ఓబీ టెండర్‌లో ఈ షరతు లేదని, మరి ఇప్పుడు, 2025-26లో మాత్రమే, అదీ కొన్ని ఎంపిక చేసిన టెండర్లకే.. ఈ షరతు ఎందుకు అకస్మాత్తుగా తీసుకొచ్చారని ప్రశ్నించారు. ఓబీ విషయంలో సైట్ విజిట్ కన్ఫర్మేషన్ సర్టిఫికేట్ విధానం తెచ్చింది మీరు అధికారంలోకి వచ్చిన తర్వాతే అన్న నిజాన్ని ఎందుకు ఒప్పుకోలేదని నిలదీశారు.
శ్వేతపత్రం విడుదల చేయాలి..
నైనీ టెండర్‌ను 2021, 2022లో రెండు సార్లు పిలిచినప్పుడు సైట్ విజిట్ సర్టిఫికేట్ షరతే లేదని, బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో అవసరం లేనిది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో అకస్మాత్తుగా ఎందుకు అవసరమైందని నిలదీశారు. మే 2025 నుంచి ఇప్పటివరకు ఎన్ని కాంట్రాక్టర్లు సైట్లు సందర్శించారు? ఎన్ని ఇమెయిల్స్, లేఖలు వచ్చాయి? ఎన్ని సర్టిఫికెట్లు జారీ అయ్యాయి? మిగిలినవాటిని ఎందుకు కారణం చెప్పకుండా తిరస్కరించారు? దీనిపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
మాకు సైట్ విజిట్ సర్టిఫికెట్ ఇవ్వడం లేదని ఎన్‌సీసీ కంపెనీ, జీఆర్‌ఎన్ కంపెనీ, మహాలక్ష్మి కంపెనీ వంటివి ఎన్నో కంపెనీలు మెయిల్ చేశాయని, ఈ మెయిల్స్ అన్ని బయటపెట్టాలని, మీరు బయటపెట్టకపోతే మేమే ఆ మెయిల్స్‌ను బయటపెడతామన్నారు. జీఎం ఆఫీసు ముందు సెల్ఫీలు పెట్టుకున్నారని, ఇది నిజమా కాదా? ఇంతకంటే ప్రూఫ్ ఏం కావాలని ప్రశ్నించారు. సాధారణంగా టెండర్ షరతులు మార్చిస్తే అన్ని కాంట్రాక్టర్లతో సమావేశం పెట్టాలని, వారి అభిప్రాయాలు తీసుకోవాలి, మినిట్స్ నమోదు చేయాలన్నారు. కానీ ఇక్కడ అది జరగలేదని, ఈ తతంగం వెనుక ఏం జరిగింది? మీటింగ్ మినిట్స్ బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ పాలనలోనే సింగరేణి ఉత్పత్తి పడిపోయింది..
మీ అవినీతి వల్ల సింగరేణిలో అనుభవం ఉన్న కాంట్రాక్టర్లను లేకుండా చేశారని, అందుకే రోజురోజుకి సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి తగ్గిపోతున్నదన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఉత్పత్తి పడిపోయిందని, బొగ్గు అమ్మకాలు తగ్గిపోయాయి. సింగరేణిలో జరిగిన స్కాంలు మొత్తం సంస్థనే ఎఫెక్ట్ చేస్తున్నాయని సింగరేణి గణాంకాలే చెబుతున్నాయని వెల్లడించారు. బీఆర్‌ఎస్ హయాంలో 2021లో 50 మి, 2022లో 62 మి, 2023లో 70 మిలియన్ టన్నుల ఉత్పత్తి సాధించామని గుర్తుచేశారు.
కాంగ్రెస్ రాగానే 2024--25లో 69 మిలియన్లకు, 2025-26లో (గత 9-10 నెలల్లో) కేవలం 43 మిలియన్ టన్నులకు పడిపోయిందని విమర్శించారు. కేసీఆర్ నష్టాల్లో ఉన్న సింగరేణిని లాభాల బాట పట్టిస్తే.. రేవంత్‌రెడ్డి రూ. 6,000 కోట్ల కుంభకోణంతో సింగరేణికి మచ్చ తీసుకొచ్చారని మండిపడ్డారు. చంద్రబాబు ఆపేస్తే, కేసీఆర్ డిపెండెంట్ ఉద్యోగాలు పునరుద్ధరించి 19,500 మందికి ఉద్యోగాలు ఇచ్చారని, ఇప్పుడున్న 42,000 మందిలో సగం మంది వారసత్వ ఉద్యోగులేనని గుర్తుచేశారు. కేసీఆర్ నెలకు ఒక మెడికల్ బోర్డు నిర్వహించేవారని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్లలో రెండేసార్లు బోర్డు పెట్టిందన్నారు.
మొదటి బోర్డులో 55 మంది వస్తే కేవలం 5 మందిని, రెండో బోర్డులో 123 మంది వస్తే కేవలం 23 మందిని మాత్రమే అన్ఫిట్ చేశారని, ఇలా మెడికల్ బోర్డులో కొర్రీలు పెట్టి వారసత్వ ఉద్యోగాలను నిర్వీర్యం చేస్తున్నారని తెలిపారు. సింగరేణి కార్మికులకు యశోద, కిమ్స్ వంటి ఆసుపత్రులలో కార్పొరేట్ వైద్యం బంద్ చేశారని, నిమ్స్, ఉస్మానియాకు పొమ్మంటున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. కేసీఆర్ కార్మికులకు ఇళ్లు ఇచ్చి ఓనర్స్ చేస్తే... కాంగ్రెస్ ఒక్కరికైనా ప్లాట్ ఇచ్చిందా అని ప్రశ్నించారు.
ప్రైవేటుపరం చేసేందుకు కుట్ర..
సింగరేణి గడించిన మొత్తం లాభం రూ. 6,394 కోట్లు అయితే, కేవలం రూ. 2,360 కోట్లు మాత్రమే ప్రాఫిట్‌గా చూపించారని, మిగతా డబ్బు ఏమైంది? కార్మికుల బోనస్‌లో కోతపెట్టి, ఆ డబ్బును ఫుట్‌బాల్ సోకులు, ముఖ్యమంత్రి ప్రచారాలకు వాడుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండేళ్లలో సింగరేణి అభివృద్ధికోసం పక్కన పెట్టిన 6,000 కోట్లు ఏమయ్యాయి? ఆ స్కాంను కూడా త్వరలో బయటపెడతామని స్పష్టం చేశారు.
సింగరేణిలో 51 శాతం వాటా రాష్ట్రానిది, 49 శాతం వాటా కేంద్రానిదని, ఇంత పెద్ద స్కాం జరుగుతున్నా కేంద్రం ఎందుకు మౌనంగా ఉందని ప్రశ్నించారు. బీజేపీ, కాంగ్రెస్ కలిసి సింగరేణిని దివాళా తీయించి, ప్రైవేటుపరం చేసే కుట్రలు చేస్తున్నాయని ఆరోపించారు. వెంటనే ప్రతి నెలా మెడికల్ బోర్డులు నిర్వహించి వారసత్వ ఉద్యోగాలు కల్పించాలని, లేదంటే వేల మంది కార్మికులతో సింగరేణి భవనం ముట్టడిస్తామని హెచ్చరించారు.
నిరాకరించిన కంపెనీల మెయిల్స్, ఫిర్యాదులపై శ్వేతపత్రం విడుదల చేయాలని, టెండర్ నిబంధనలు మార్చినప్పుడు పెట్టిన మీటింగ్ మినిట్స్ బయటపెట్టాలన్నారు. భట్టి విక్రమార్కకు చిత్తశుద్ధి ఉంటే, ఈ మొత్తం బొగ్గు కుంభకోణంపై సిట్టింగ్ జడ్జి లేదా సీబీఐ విచారణ కోరాలని డిమాండ్ చేశారు. సింగరేణి కార్మికుల కష్టార్జితాన్ని కాపాడే వరకు మేము వదిలిపెట్టబోమని, సిరుల గని సింగరేణిని కాపాడుకుంటామని స్పష్టం చేశారు.
ఏ హోటల్లో మీటింగ్ పెట్టారో కూడా చెప్తా..
ఇప్పటికి ఓబీ స్కాం, సోలార్ స్కాం మాత్రమే చెప్పానని, సింగరేణిలో ఇంకా అనేక స్కాములు ఉన్నాయని చెప్పారు. ఈ కుంభకోణంలో కింగ్ పిన్ ఏ హోటల్లో మీటింగ్ పెట్టారో, ముఖ్యమంత్రి బంధువు కూడా ఆ హోటల్లో కూర్చున్న ఫోటోలు మా దగ్గర ఉన్నాయని, అవి టైం వచ్చినప్పుడు బయట పెడతామని తెలిపారు. డీజిల్‌ను కాంట్రాక్టర్ల పరిధిలోకి తెచ్చిన తర్వాత టర్నోవర్ అర్హత పెంచి 20 ఏళ్ల అనుభవం ఉన్న స్థానిక కాంట్రాక్టర్లను పక్కన పెట్టారని, ఇక నుంచి డీజిల్ కాంట్రాక్టర్ల పరిధిలోనే ఉంటే, ఉన్న కాంట్రాక్టర్లు స్వయంగా డీజిల్ కొనుగోలు చేసుకునే అవకాశం ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు.
మీ స్వార్థం కోసం మైనింగ్ అనుభవం లేని కొత్త కాంట్రాక్టర్లకు దారులు తెరిచారని ఆరోపించారు. మేము బొగ్గు స్కాం అని భయపెట్టగానే నాలుగు పేపర్లు పట్టుకొని వచ్చి, మీడియాని సైతం తప్పుదారి పట్టించే ప్రయత్నం చేసిన భట్టి విక్రమార్క.. నేను బయటపెట్టిన సోలార్ స్కామ్, పేలుడు పదార్థాల స్కామ్, ఉద్యోగుల డీ-ప్రొమోషన్ వంటి కీలక అంశాలపై ఒక్క మాట కూడా ఎందుకు మాట్లాడలేదని ఆయన నిలదీశారు.
ఎందుకంటే సింగరేణిలో పదుల సంఖ్యలో స్కాములు జరిగిందన్నది వాస్తవమని, అడ్డగోలుగా నిబంధనలు మార్చి, రేవంత్ రెడ్డి బావమరిదికి, ఇతర అనుయాయులకు టెండర్లు కట్టబెట్టింది నిజం కాబట్టి అన్నారు. కాంగ్రెస్ రెండేళ్ల పాలనలో స్కీములు రాలేదు గానీ పదుల సంఖ్యలో స్కాంలు మాత్రం వచ్చాయని ఎద్దేవా చేశారు. సిరుల గనిగా మనం ఇన్నాళ్లు పిలుచుకున్న సింగరేణి.. ఇప్పుడు స్కాముల గనిగా మారిందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కళ్లల్లో ఆనందం కోసం పనిచేయడం మానుకోవాలని భట్టిని ఉద్దేశించి హరీశ్ అన్నారు.
ఖరారైన టెండర్లన్నీ రద్దు చేయాలి..
ఒక నైనీ గోల్డ్ బ్లాక్ టెండర్ రద్దు చేయడమే కాదు, సైట్ విజిట్ సర్టిఫికెట్‌తో ఖరారైన టెండర్లన్నీ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే కొన్ని అవార్డు అయిన టెండర్లు ఉన్నాయని, మరికొన్ని టెండర్ ప్రక్రియ తొలి దశలో ఉన్నాయని, ఇంకొన్ని టెండర్ దాఖలు చేసే దశలో ఉన్నాయని తెలిపారు. సైట్ విజిట్ సర్టిఫికెట్ అనేది లోపభూయిష్టమైనదని, ఇందులో అవినీతి జరుగుతున్నదని స్పష్టంగా ప్రజలకు అర్థమైందన్నారు.
మీకు పారదర్శకత్వం ఉంటే, నిజాయితీ ఉంటే సైట్ విజిట్ సర్టిఫికెట్ మీద జరిగిన ఓబీ వర్క్స్, సోలార్ పవర్ ప్లాంట్స్, మిగతా అన్ని టెండర్లను క్యాన్సిల్ చేయాలని డిమాండ్ చేశారు. మే 2025 తర్వాత పిలిచిన టెండర్లలో చాలా మంది కాంట్రాక్టర్లు సైట్ విజిట్ చేసి, లేఖలు ఇచ్చారని, అధికారిక ఇమెయిల్స్ పంపడంతోపాటు ఫోటోలు కూడా జతచేసినా వారికి సర్టిఫికెట్లు ఇవ్వలేదని వెల్లడించారు.
టెండర్ చివరి గంట వరకు కాంట్రాక్టర్లను వేచిచూసేలా చేసి, కేవలం 2-3 సంస్థలకు మాత్రమే పాత తేదీలతో బ్యాక్ డేటెడ్ సర్టిఫికెట్లు జారీ చేశారని ఆరోపించారు. టెండర్ డాక్యుమెంట్‌లో సైట్ విజిట్ చేసిన వెంటనే స్థానిక జీఎం సర్టిఫికేట్ ఇవ్వాలి అని స్పష్టంగా ఉందని, మరి సైట్ విజిట్ చేసినప్పటికీ ఎందుకు ఇవ్వలేదు? ఈ ఆలస్యం వెనుక ఎవరి ఆదేశాలు ఉన్నాయి? ఏచీకటి ఒప్పందం ఉంది? ఎవరి వాటాలు, కమిషన్లు దాగి ఉన్నాయని హరీశ్ ప్రశ్నించారు.
రింగ్ మాస్టర్ సృజన్‌రెడ్డే..
భట్టి విక్రమార్క ప్రెస్‌మీట్ చూస్తుంటే ఉల్టా చోర్ కొత్వాల్ కో డాంటే అన్న సామెత గుర్తుకొస్తున్నదని ఎద్దేవా చేశారు. బొగ్గు కుంభకోణంపై స్పష్టమైన సమాధానం ఇవ్వకుండా మాటల గారడీతో, నాలుగు కాగితాలు చూపి మసిపూసి మారేడు కాయ చేసే ప్రయత్నం చేశారు. సైట్ విజిట్ సర్టిఫికెట్‌పై భట్టి విక్రమార్క అబద్ధాలను వండివార్చారని విమర్శించారు. సింగరేణి కాలరీస్ అనేది తెలంగాణ ప్రజల ఆస్తి అని, ఇది ఏ ఒక్క మంత్రికో, ప్రభుత్వానికో, కొద్దిమంది కాంట్రాక్టర్లకో చెందిన సంస్థ కాదని స్పష్టం చేశారు.
సింగరేణిలో పారదర్శకత, పోటీ, న్యాయం అనే మౌలిక సూత్రాలతో నడుస్తున్నదని, సింగరేణి టెండర్ ప్రక్రియను చూస్తే ఈ మూడు సూత్రాలకు మంగళం పాడారు అని స్పష్టమవుతున్నదని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ విధానాలన్నీ పక్కనపెట్టి అవసరమైన చోట వారి అనుకూలమైన విధానాలను మార్చుకున్నారని, సింగరేణి స్కామ్‌కు ఎవరు బాధ్యులు? ఎంత నష్టం జరిగింది? లబ్ధి పొందిన వారు ఎవరు? ఈ మూడు కీలక ప్రశ్నల్లో ఒక్కదానికైనా భట్టి సమాధానం చెప్పకుండా దాటివేశారని మండిపడ్డారు.
2025 జనవరిలో భూపాలపల్లి టెండర్‌కు సైట్ విజిట్ షరతు లేకుండానే రివర్స్ ఆక్షన్ ద్వారా అంచనా రేట్ల కంటే 7 శాతం తక్కువకు పనులు అప్పగించారని, అప్పుడు సైట్ విజిట్ అవసరం రాలేదా అని ప్రశ్నించారు. కానీ మూడునెలల్లోనే, 2025 మేలో వీకే ఓసీ టెండర్‌కు మాత్రం సైట్ విజిట్ సర్టిఫికేట్ షరతు పెట్టారని, పోటీ తగ్గిపోయి ఫలితంగా అంచనా రేట్ల కంటే ఎక్కువ రేట్లకు లబ్ధిదారులు సృజన్‌రెడ్డి శోధా కన్‌స్ట్రక్షన్ కాంట్రాక్టర్‌కు పని దక్కిందని గుర్తు చేశారు.
ఓబీ రిమూవల్ కాంట్రాక్టర్లు సైట్ విజిట్ సర్టిఫికెట్ పెట్టడం వల్ల మొట్టమొదటి లబ్ధిదారుడు ముఖ్యమంత్రి బావమరిది సృజన్‌రెడ్డి అని వెల్లడించారు. అన్ని ఓబీ వర్క్‌లకు సైట్ విజిట్ సర్టిఫికెట్ నిబంధన పెట్టి అన్ని రింగ్ చేయడం, 7 శాతం నుంచి 10 శాతానికి టెండర్ వేయడం, ఏటీఎంలో వచ్చిన 10 శాతం క్యాష్ డౌన్ చేయాలనే నిబంధన పెట్టుకున్నారని వివరించారు.
2025 మే తర్వాత ఓబీ రిమూవల్ కాంట్రాక్టర్లకు ఏ టెండర్ వచ్చినా, సైట్ విజిట్ సర్టిఫికెట్ ఎవరికి ఇవ్వాలన్నా ఈయనే రింగ్ మాస్టర్ సృజన్‌రెడ్డి అని తెలిపారు. ఇంత స్పష్టంగా తాను బయటపెట్టినా కూడా స్కాం జరగలేదని భట్టి విక్రమార్క బుకాయించడం శోచనీయమన్నారు.