21 June, 2026 | 7:02 PM

విద్యార్థులకు అండగా నిలిచిన పోలీసులు

21-06-2026 05:56 PM

- నీట్ పరీక్ష కేంద్రానికి తీసుకొచ్చిన భీమారం ఎస్సై

మంచిర్యాల,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా కేంద్రంలో నీట్ పరీక్ష రాసే విద్యార్థులను పరీక్షా కేంద్రాలకు తీసుకెళ్లేందుకు పోలీసులు తమ వంతు సాయం అందించారు. పరీక్షలు విద్యార్థులకు ఎంతో ఒత్తిడితో కూడుకున్న సమయం. అలాంటి సమయంలో ఎదురయ్యే చిన్న సమస్య కూడా వారిని తీవ్ర ఆందోళనకు గురిచేస్తుంది. మంచిర్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన నీట్ పరీక్షా కేంద్రం వద్ద ఇలాంటి సంఘటన చోటుచేసుకోగా భీమారం ఎస్సై రాజేందర్ సకాలంలో స్పందించి విద్యార్థినికి సహాయం చేసి మానవత్వాన్ని చాటుకున్నారు.

వివరాల్లోకి వెళితే... నీట్ పరీక్ష రాయడానికి వచ్చిన ఓ విద్యార్థిని పాస్‌పోర్టు సైజు ఫొటో తీసుకురావడం మరిచిపోయింది. పరీక్షా కేంద్రం నిబంధనల ప్రకారం ఫొటో తప్పనిసరి కావడంతో ఆమె తీవ్ర ఆందోళనకు గురైంది. పరీక్ష రాయలేనేమోనన్న భయంతో పరీక్షా కేంద్రం బయటకు వచ్చిన విద్యార్థి పరిస్థితిని అక్కడే విధులు నిర్వహిస్తున్న భీమారం ఎస్సై రాజేందర్ గమనించి వెంటనే పోలీసు వాహనంలో సమీపంలోని ఫొటో స్టూడియోకు తీసుకెళ్లి ఫొటో తీయించి, అనంతరం ఆమెను సకాలంలో తిరిగి పరీక్షా కేంద్రానికి చేర్చారు. దీంతో విద్యార్థిని ఎలాంటి ఇబ్బందులు లేకుండా పరీక్షకు హాజరైంది. విద్యార్థిని భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని తక్షణమే స్పందించి సహాయం చేసిన ఎస్సై రాజేందర్‌ను అక్కడ ఉన్న విద్యార్థులు, తల్లిదండ్రులు, ప్రజలు అభినందించారు. పోలీసుల మానవతా దృక్పథాన్ని ప్రశంసిస్తూ హర్షం వ్యక్తం చేశారు.