భేషుగ్గా బైడన్ ఆరోగ్యం
సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలు ‘చీఫ్ ఫేక్’
ఇదంతా రిపబ్లికన్ పార్టీ నేతల కుట్ర.. వైట్‌హౌస్ ప్రకటన
వాసింగ్టన్, జూన్ 18: అమెరికా అధ్యక్షుడు జోబైడన్ ఆరోగ్యంపై అనేక అనుమానాలు వ్యక్తమయ్యే రీతిలో ప్రస్తుతం సోషల్‌మీడియాలో అనేక వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి. ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారన్న విషయం అక్కడ హాట్ టాపిక్‌గా మారింది. ఒకవైపు అధ్యక్ష పదవి ఎన్నికలు సమీపిస్తుండంతో వీటన్నింటికీ చెక్‌పెట్టాలన్న ఉద్దేశంతో తాజాగా వైట్ హౌస్ నుంచి ఓ కీలక ప్రకటన విడుదలైంది.
ప్రతిపక్ష రిపబ్లికన్ పార్టీ నేతలపై విమర్శల వర్షం కురిపించింది. సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలు రిపబ్లికన్ నేతల కుట్ర అని ప్రకటించింది. జోబైడన్ ఆరోగ్యంపై చక్కర్లు కొడుతున్న వీడియోలన్నీ చీప్ ఫేక్ వీడియోలని కొట్టిపారేసింది. ఇటీవల ఇటలీలో జరిగిన జీ7 సదస్సులో జోబైడన్ ప్రవర్తనపై కొందరు అసత్య ప్రచారం చేస్తున్నారని, ఆయన సదస్సుల్లో పాల్గొన్నప్పుడు పూర్తి స్పృహతో ఉన్నారని, పైగా ఆ సదస్సు కూడా విజయవంతమైందని పేర్కొన్నది. అలాగే ఇటీవల వైట్‌హౌస్‌లో జరిగిన ఓ కల్చరల్ ఈవెంట్‌లో జోబైడన్ చలనం లేకుండా నించోవడంపై కూడా వైట్‌హౌస్ వివరణ ఇచ్చింది. ఆ కార్యక్రమంలో జోబైడన్ నించొని సంగీతం వింటున్నారని స్పష్టతనిచ్చింది.






