16 July, 2026 | 4:13 PM

అమెరికన్ సీక్రెట్ సర్వీస్ ఏజెంట్‌ను దోచుకున్న దుండగులు

19-06-2024 12:00 AM

లాస్‌ఏంజెల్స్‌లో వెలుగు చూసిన ఘటన

వాషింగ్టన్, జూన్ 18: దేశాధినేతల్లో అందరికన్న అమెరికా అధ్యక్షుడికి అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉంటుందని, ఆయనకు సుశిక్షితులైన బలగాలు రక్షణ కల్పిస్తాయనే విషయం అందరికీ తెలిసిందే. కానీ అలాంటిది ఆయన భద్రతా సిబ్బందిలో ఒకరైన సీక్రెట్ సర్వీసెస్ ఏజెంట్‌ను దుండగులు దోచుకున్న ఘటన లాస్‌ఏంజెల్స్‌లో వెలుగు చూసింది. అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామాతో కలిసి తాజాగా ఆ దేశ అధ్యక్షుడు జోబైడన్ లాస్ ఏంజెల్స్‌లో డెమోక్రాటిక్ పార్టీ తరఫున విరాళాల సేకరణ ప్రారంభించారు.

ఈ కార్యక్రమం తర్వాత ఓ సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ తిరిగి కాన్వాయ్‌లో వాషింగ్టన్‌కు వెళ్తుండగా టూస్టిన్ ప్రాంతంలో దుండగులు అడ్డుకున్నారు. గన్‌తో కారులో ప్రయాణిస్తున్న ఏజెంట్‌ను బెదరించారు. అతడి వద్ద ఉన్న బ్యాగ్‌ను అపహరించి దుండగులు ఉడాయిస్తుండగా ఏజెంట్ కాల్పులు జరిపాడు. అయినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. దీంతో ఆయన టూస్టిన్ పోలీసుల సాయం కోరాడు. ఘటనలో ఎవరైనా గాయపడ్డారా.. ఇంకేమైనా నష్టం జరిగిందా అనే అంశంపై స్పష్టత రావాల్సి ఉన్నది. దోపిడీ జరిగిన విషయాన్ని సీక్రెట్ సర్వీసెస్ అధికారి ఒకరు ధ్రువీకరించారు.