భీమ్ దీక్ష ప్రారంభోత్సవాన్ని విజయవంతం చేయాలి
కొండగడుపుల. ఎల్లయ్య స్వేరో
తుంగతుర్తి,(విజయక్రాంతి): భీమ్ దీక్ష కార్యక్రమాన్ని విజయవంతం చేయుటకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని సూర్యాపేట జిల్లా స్వేరో నాయకులు కొండగడుపుల ఎల్లయ్య అన్నారు. సోమవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ స్వేరో నెట్వర్క్ ఆధ్వర్యంలో ఈనెల 15 న దంతాలపల్లి మండల కేంద్రంలో నిర్వహించనున్న భీమ్ దీక్షతో..సమాజంలో సామాజిక న్యాయం, సమానత్వం, రాజ్యాంగ విలువలను బలోపేతం చేయాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.
ముఖ్యఅతిథిగా సుప్రీం స్వేరో డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ (ఐపీఎస్, వీఆర్ఎస్)పాల్గొననున్న ఈ కార్యక్రమంలో స్వేరో నాయకులు,యువత, ప్రజాప్రతినిధులు, సామాజిక కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. భీమ్ దీక్ష ద్వారా సమాజంలో అవగాహన పెంపొందించడమే కాకుండా డా. బాబాసాహెబ్ అంబేద్కర్ తో పాటు మహనీయుల ఆశయాలను ప్రజల్లో విస్తృతంగా చాటాలని నిర్వాహకులు పేర్కొన్నారు.ఈ కార్యక్రమానికి సమాజంలోని ప్రతి వర్గం నుంచి మద్దతు లభిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.




