01-11-2025 08:13:36 PM
- హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను బేఖతార్ చేస్తున్న జిల్లా ఉన్నతాధికారులు
- కబ్జాకు గురవుతున్న కొన్ని ఎకరాల భీమన్న గుట్ట ప్రాంతం
- స్పందించని అధికారులు, పాలకులు
- నిర్మల్ ప్రెస్ క్లబ్ సమావేశంలో మాట్లాడిన జిల్లా ముదిరాజ్ కోర్ కమిటీ సభ్యులు
నిర్మల్ రూరల్: నిర్మల్ జిల్లా కేంద్రంలోని దివ్య నగర్ సమీపంలో గల, ముదిరాజ్ కులస్తుల ఆరాధ్య దైవమైన భీమన్న గుట్టను ముదిరాజులకే కేటాయించాలని నిర్మల్ జిల్లా ముదిరాజ్ కోర్ కమిటీ సభ్యులు పేర్కొన్నారు. శనివారం రోజు జిల్లా కోర్ కమిటీ సభ్యులు నిర్మల్ ప్రెస్ క్లబ్ లో సమావేశాన్ని ఏర్పాటు చేసి మాట్లాడారు. ముదిరాజుల కులవృత్తి అయిన పండ్ల వ్యాపారంతో తమ జీవన విధానం కొనసాగిస్తున్నామని అన్నారు. కులవృత్తి వ్యాపారాలు చేసుకునే ముదిరాజ్ కులస్తులకు చెందిన భీమన్న గుట్టను కొందరు వ్యక్తులు కబ్జా చేశారని ఆరోపించారు.
గత కొన్ని సంవత్సరాల కిందటే హైకోర్టు ద్వారా ముదిరాజ్ కులస్తులకు కులవృత్తి చేసుకోవడానికి, భీమన్న దేవుడిని పూజించడానికి కొన్ని ఎకరాల భూమిని ముదిరాజ్ కులస్థులకు కేటాయించడం జరిగిందని అన్నారు. అయినా కూడా కొందరు వ్యక్తులు ఇదేమి పట్టించుకోకుండా అక్కడి భూమిని కబ్జా చేస్తున్నారని మండిపడ్డారు. కోట్ల రూపాయల భూములను కబ్జా చేస్తుంటే అధికారులు మాత్రం చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారన్నారు.
ఉన్నతాధికారులకు, నాయకులకు ఎన్నిసార్లు వినతి పత్రాలు ఇచ్చిన నామమాత్రంగానే చూస్తున్నారని మండిపడ్డారు. హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల ద్వారా భీమన్నగుట్టను ముదిరాజ్ కులస్తులకు కేటాయించాలని తెలిపారు. లేనియెడల జిల్లా, రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేస్తామని ప్రభుత్వానికి తాము హెచ్చరిస్తున్నామని పేర్కొన్నారు. భీమన్న గుట్టలోని తమకు రావాల్సిన కొన్ని ఎకరాల స్థలాన్ని ముదిరాజులకు కేటాయించకపోతే జిల్లా, రాష్ట్ర వ్యాప్తంగా నిరాహార దీక్షలకు సైతం పూనుకుంటామని తెలిపారు.