1 September, 2026 | 3:51 PM

బొగ్గు ఉత్పత్తి పెంచాల్సిన అవసరం ఉంది : ఏరియా జీఎం

01-09-2026 03:15 PM

ఆగస్టు నెల ఉత్పత్తి వివరాలు వెల్లడించిన జీఎం 

భూపాలపల్లి టౌన్, సెప్టెంబర్ 01 (విజయక్రాంతి): సింగరేణి భూపాలపల్లి ఏరియాలో(Singareni Bhupalpally Area) సంస్థ నిర్దేశించిన లక్ష్యం ప్రకారం బొగ్గు(Coal Production) ఉత్పత్తిని పెంచాల్సిన అవసరం ఉందని ఏరియా జనరల్ మేనేజర్ ఏనుగు రాజేశ్వర్ రెడ్డి అన్నారు. ఈ మేరకు మంగళవారం ఆగస్టు నెలకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ బొగ్గు ఉత్పత్తి లక్ష్యం 3.73 లక్షల టన్నులు కాగా 1.60 లక్షల టన్నులు ఉత్పత్తితో 43 శాతం ఉత్పత్తి సాధించినట్లు పేర్కొన్నారు. అదేవిధంగా సెప్టెంబర్ నెల ఉత్పత్తి లక్ష్యం 3.84 లక్షల టన్నులు అని తెలిపారు.

అధికారులు, ఉద్యోగులు ఉత్పత్తి పెంపు లక్ష్యాలను సాధించేందుకు సమిష్టిగా కృషి చేయాలన్నారు. ముఖ్యంగా ఎస్ డీ ఎల్ యంత్రాల(SDL machines) పనిగంటలను పెంచేందుకు ప్రత్యేక దృష్టి పెట్టాలని, అందుకు తగిన విధంగా కార్యాచరణ రూపొందించి అమలు చేయాలని అన్నారు. గైర్హాజరు శాతం తగ్గించడం ద్వారా ఉత్పత్తి స్థాయిని గణనీయంగా పెంచవచ్చని ఆ దిశగా కార్మికులకు(Singareni workers) నిరంతర అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ప్రతి ఉద్యోగి, కార్మికుడు తప్పనిసరిగా వర్కింగ్ పర్మిషన్ సహా అన్ని భద్రతా నియమ నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని సూచించారు.

భద్రత విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం సహించబోమని, రక్షణ విషయంలో రాజీ లేదని స్పష్టం చేశారు. ఎల్నినో ప్రభావం వలన బొగ్గు డిమాండ్ ఎక్కువగా ఉన్న దృష్ట్యా బొగ్గు ఉత్పత్తి, రవాణా కార్యకలాపాలకు ఎలాంటి అంతరాయం కలగకుండా అధికారులు సమగ్ర ప్రణాళికతో ముందస్తు చర్యలు చేపట్టాలని ఓపెన్ కాస్ట్  గనులు, బొగ్గు నిల్వ ప్రాంగణాలు, బొగ్గు రవాణాకు ఉపయోగించే రహదారులను మరమ్మతు చేసి, ఎటువంటి అవరోధాలు తలెత్తకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.