1 September, 2026 | 4:16 PM

పల్లెల్లో.. ‘బెల్ట్‌’ మద్యం బీభత్సం

01-09-2026 03:44 PM
  1. ఇళ్లే అడ్డాలు.. కిరాణా దుకాణాలే మద్యం కేంద్రాలు.?
  2. అధిక ధరలకు అక్రమంగా విక్రయాలు.
  3. బెల్ట్ షాప్ నిర్వాహకులకు... వైన్స్ యజమానుల అండ.
  4. మామూళ్ల మత్తులో ఎక్సైజ్ శాఖ అధికారులు...
  5. అక్రమ బెల్ట్ షాపులపై ఎక్సైజ్ అధికారులు ఉక్కు పాదం మోపెనా...?

బాన్సువాడ,సెప్టెంబర్ 01 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లాలోని(Kamareddy) పల్లె ప్రాంతాల్లో అక్రమ బెల్ట్‌ షాపుల దందా(Illegal belt shops) విచ్చలవిడిగా కొనసాగుతోందన్న ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. ఒకప్పుడు రహస్యంగా సాగిన బెల్ట్‌ షాపుల వ్యవహారం ఇప్పుడు బహిరంగంగానే కొనసాగుతోందని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. బెల్ట్‌ షాపుల దందా విచ్చలవిడిగా సాగుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కామారెడ్డి జిల్లాలోని  గ్రామాల్లో కిరాణా దుకాణాలు, ఇళ్లను అడ్డాగా చేసుకుని అక్రమంగా మద్యం(Illicit liquor) విక్రయిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.

ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా మద్యం విక్రయాలు జరుగుతున్నా సంబంధిత ఎక్సైజ్ శాఖ అధికారులు(Excise Department officials) పట్టించుకోవడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మద్యం దుకాణాల్లో(Liquor Stores) లభించే ధరల కంటే అధిక ధరలకు బెల్ట్‌ షాపుల్లో మద్యం విక్రయిస్తున్నారని, రాత్రి వేళల్లోనూ విక్రయాలు కొనసాగుతున్నాయని గ్రామస్థులు చెబుతున్నారు. దీంతో కూలీలు, పేద కుటుంబాలపై ఆర్థిక భారం పెరుగుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బెల్టు షాపుల నిర్వాహకులు వైన్స్ నుండి ద్విచక్ర వాహనాలపై మద్యాన్ని తరలిస్తున్నారు.

బెల్టు షాపుల్లో మద్యం అధిక ధరలకు విక్రాయిస్తున్నా కూడా బెల్ట్ షాపుల్లోనే కొనుగోలు చేస్తున్నారు. వీరికి వైన్స్ నిర్వహకులు కొండంత అండగా ఉంటున్నారు. మీ దగ్గరికి ఎవరూ రారు.. మేము చూసుకుంటాం అని భరోసానిస్తున్నారు. అందుకుగానూ ఒక్కో బీరుపై రూ.20, మద్యం బాటిల్‌పై రూ.20 నుంచి 30 వసూలు చేస్తున్నారు. బెల్ట్ షాప్ నిర్వహకులు(Belt Shop Operators) వినియోగదారుల నుంచి ఒక్కో సీసాపై రూ.30-50 వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వెలువేత్తుతున్నాయి

అనుమతులు లేకుండానే అమ్మకాలు?

మద్యం విక్రయాలకు ఎలాంటి అనుమతులు లేని ప్రాంతాల్లోనూ బాటిళ్లు అందుబాటులో ఉంటున్నాయని స్థానికులు అంటున్నారు. నిర్ణీత ధరల కంటే అధిక ధరలకు మద్యం విక్రయిస్తున్నారని, అవసరమైన సమయంలో ఎక్కడికెళ్లినా మద్యం దొరికే పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

‘మామూళ్ల’ ఆరోపణలు.. విచారణ కోరుతున్న ప్రజలు

అక్రమ బెల్ట్‌ షాపుల నిర్వాహకుల నుంచి కొందరు అధికారులకు నెలవారీ మామూళ్లు అందుతున్నాయన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ప్రతి నెల ఎక్సైజ్ శాఖలోని కొంతమంది అధికారులు సిబ్బంది గ్రామాల్లో నిర్వహించే బెల్టు షాపు నిర్వాహకుల నుండి మామూలు వసూలు చేస్తున్నారని ఎక్సైజ్ శాఖ(Excise Department) ఉన్నతాధికారులు దాడులు చేసే సమయంలో బెల్టు షాపు నిర్వాహకులకు సమాచారం అందిస్తున్నారని ఆరోపణలు కూడా చర్చలుగా సాగుతున్నాయి. ఉన్నతాధికారులు ప్రత్యేకంగా విచారణ చేపట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

యువత భవిష్యత్తుపై ఆందోళన

గ్రామాల్లో మద్యం సులభంగా లభిస్తుండటంతో యువతపై(Youth) తీవ్ర ప్రభావం పడుతోందని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చిన్న వయసులోనే మద్యపానానికి అలవాటు పడుతున్న వారి సంఖ్య పెరుగుతోందని, ఇది కుటుంబాలపై ఆర్థిక, సామాజిక ప్రభావం చూపుతోందని చెబుతున్నారు.

కుటుంబాల్లో కలహాలు.. ఆర్థిక ఇబ్బందులు

మద్యపానానికి బానిసైన కొందరు వ్యక్తుల కారణంగా కుటుంబాల్లో గొడవలు, ఆర్థిక ఇబ్బందులు పెరుగుతున్నాయని స్థానికులు పేర్కొంటున్నారు. రోజువారీ కూలీ డబ్బులు మద్యం కోసం ఖర్చు చేయడంతో కుటుంబ పోషణ కష్టంగా మారుతోందని పలువురు వాపోతున్నారు.

బెల్ట్‌ షాపులపై ఉక్కుపాదం మోపాలి

గ్రామీణ ప్రాంతాల్లో మద్యం అక్రమ విక్రయాలకు పూర్తిస్థాయిలో అడ్డుకట్ట వేయాలని, ముఖ్యంగా పాఠశాలలు, నివాస ప్రాంతాల సమీపంలో ఇలాంటి కార్యకలాపాలు ఉంటే కఠినంగా వ్యవహరించాలని ప్రజలు కోరుతున్నారు. అక్రమ బెల్ట్‌ షాపులపై ప్రత్యేక నిఘా(Special surveillance) ఏర్పాటు చేసి, తరచూ తనిఖీలు నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు.