1 September, 2026 | 4:05 PM

మార్చి నాటికి ఆర్‌అండ్‌బీ పనులు పూర్తి చేయాలి

01-09-2026 03:33 PM

పెద్దపల్లి,సెప్టెంబర్ 1(విజయ క్రాంతిఫ): జిల్లాలో రోడ్లు, భవనాల శాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న అభివృద్ధి పనులను వేగవంతం చేసి వచ్చే మార్చి నెలలోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష(Collector Koya Sriharsha) అధికారులను ఆదేశించారు. పనుల నాణ్యత విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడవద్దని స్పష్టం చేశారు. మంగళవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో ఆర్‌అండ్‌బీ శాఖ(R&B Department) పనుల పురోగతిపై ఏఈలు, డీఈలు, సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాలోని అన్ని మండలాల్లో జరుగుతున్న రహదారులు, భవనాలు, ఇతర అభివృద్ధి పనుల పురోగతిని మండలాల వారీగా సమీక్షించారు. ప్రారంభం కాని పనులను వెంటనే చేపట్టాలని, వివిధ దశల్లో ఉన్న పనులను వేగవంతం చేయాలని,పెండింగ్‌లో ఉన్న పనులపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్(Collector) సూచించారు.

కాంట్రాక్టర్లతో సమన్వయం చేసుకుంటూ నిర్దేశిత గడువులోగా పనులు పూర్తి అయ్యేలా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు.రహదారులు, భవన నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని తెలిపారు. క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యలను వెంటనే గుర్తించి పరిష్కరించాలని,ప్రతి మండలానికి ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకుని పనులను ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. ప్రజలకు నాణ్యమైన మౌలిక వసతులు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొంటూ.. పనుల పురోగతి, నాణ్యతపై అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించాలని  శ్రీహర్ష(Collector Koya Sriharsha) ఆదేశించారు. ఈ సమావేశంలో ఆర్‌అండ్‌బీ ఈఈ భావ్‌సింగ్, ఏఈలు, డీఈలు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.