14 April, 2026 | 1:14 PM

ఐ-బొమ్మ కేసులో బిగ్ ట్విస్ట్!

29-12-2025 02:02 AM

అడ్డంగా బుక్కైన రవి.. చెల్లని రూమ్మేట్ డ్రామా

నాకు రవి ఎవరో తెలియదన్న ప్రహ్లాద్

బెంగళూరు నుంచి పిలిపించి విచారించిన పోలీసులు

హైదరాబాద్, సిటీబ్యూరో డిసెంబర్ 28 (విజయక్రాంతి): పైరసీ వెబ్‌సైట్ ఐ-బొమ్మ నిర్వాహకుడు ఇమంది రవి కేసు దర్యాప్తులో బిగ్‌ట్విస్ట్. విచారణలో రవి ఆడిన నాటకం రట్టు అయ్యింది. తన ఐడెంటిటీని దాచిపెట్టేందుకు రవి వేసిన ఎత్తుగడలను పోలీసు లు బట్టబయలు చేశారు. ప్రహ్లాద్ వెల్లేల అనే వ్యక్తి పేరుతో రవి సృష్టించిన నకిలీ పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ వ్యవహారం ఇప్పుడు ఈ కేసులో కీలకంగా మారింది. ఐబొమ్మ కేసులోకి తాజాగా బెంగళూరు టెక్కీ ఎంట్రీ అయ్యాడు.

తన పేరు, ఫొటో కాకుండా ప్రహ్లాద్ వెల్లేల పేరుతో ఉన్న ఐడీ కార్డులను రవి వినియోగించినట్లు పోలీసులు గుర్తించిన విషయం తెలిసిందే. దీనిపై గతంలో ప్రశ్నించగా.. ‘ప్రహ్లాద్ నా రూమ్మేట్‘ అని రవి పోలీసులకు చెప్పాడు. ఈ విషయాన్ని నిర్ధారించుకునేందుకు పోలీసులు బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్న అసలైన ప్రహ్లాద్ వెల్లేలను నగరానికి పిలిపించారు. కస్టడీలో ఉన్న ఇమంది రవి ఎదుటే ప్రహ్లాద్‌ను కూర్చోబెట్టి విచారించారు.

షాక్ తిన్న ప్రహ్లాద్..

పోలీసుల విచారణలో ప్రహ్లాద్ షాకింగ్ విషయాలు వెల్లడించారు. ‘అసలు ఇమంది రవి ఎవరో నాకు తెలియదు. నా పేరుతో ఇతను పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్నాడని తెలిసి షాక్ అయ్యా. ఇతనితో నాకు ఎలాంటి సంబంధమూ లేదు’ అని ప్రహ్లాద్ పోలీసులకు స్పష్టం చేసినట్లు సమాచారం. దీంతో రవి చెప్పిన రూమ్మేట్ కథ కట్టుకథేనని తేలిపోయింది.

డాక్యుమెంట్ల చోరీ..

ప్రహ్లాద్ స్టేట్‌మెంట్‌తో పోలీసులు ఓ నిర్ధారణకు వచ్చారు. ప్రహ్లాద్‌కు తెలియకుండానే అతని డాక్యుమెంట్లను రవి దొంగి లించి ఉంటాడని, లేదా జిరాక్స్ కాపీలను సేకరించి వాటి ఆధారంగా మార్ఫింగ్ చేసి తన ఫొటోతో నకిలీ ఐడీలు సృష్టించి ఉంటాడని అనుమానిస్తున్నారు. ఈ నకిలీ పత్రా లను ఉపయోగించే సర్వర్లు కొనుగోలు చేయడం, బ్యాంక్ లావాదేవీలు నడపడం వంటివి చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు.

నేటితో ముగియనున్న కస్టడీ..

ఇమంది రవి పోలీస్ కస్టడీ నేటితో ముగియనుంది. ప్రహ్లాద్‌తో ముఖాముఖి విచారణలో వెల్లడైన అంశాలు, నకిలీ పత్రాల సృష్టిపై సేకరించిన ఆధారాలను పోలీసులు కోర్టుకు సమర్పించనున్నారు. ఈ కేసులో మరిన్ని అరెస్టులు ఉండే అవకాశం ఉందా.. అనే కోణంలోనూ దర్యాప్తు కొనసాగుతోంది.