29-12-2025 02:01:46 AM
ప్రజల పక్షాన బలమైన స్వరం వినిపించాలి
ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో బీజేపీ స్టేట్ చీఫ్ భేటీ
అనుసరించాల్సిన వ్యూహాలపై రాంచందర్ రావు దిశానిర్దేశం
హైదరాబాద్, డిసెంబర్ 28 (విజయక్రాంతి): అసెంబ్లీ సమావేశాలకు బీజేపీ సిద్ధ మైంది. కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ను దీటుగా ఎదుర్కొనేలా వ్యూహాలను సిద్ధం చేసుకుంది. సోమవారం నుంచి ప్రారంభం కానున్న తెలంగాణ రాష్ర్ట శాసనసభ సమావేశాల నేపథ్యంలో బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు అధ్యక్షతన ఆదివారం రాష్ర్ట పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులతో కీలక స మావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో బీజేపీ శాసనసభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి, శాసనసభ్యులు వెంకటరమ ణారెడ్డి, రాకేష్‌రెడ్డి, ఎమ్మెల్సీలు అంజిరెడ్డి, ఏవీఎన్ రెడ్డి, మల్క కొమురయ్య, కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖ మాజీ సలహాదారు, మహారాష్ర్ట ప్రభుత్వ సలహాదారు వెదిరె శ్రీరామ్ పాల్గొన్నారు. వ్యక్తిగత కారణాలతో హాజరుకాని మిగతా బీజేపీ ఎమ్మెల్యేలతో కూడా రాంచందర్ రావు ఫోన్ ద్వారా సభలో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేశారు.
అసెంబ్లీలో సమన్వయం, వ్యూహాత్మకంగా వ్యవహరించాలని సూచించారు. శాసనసభ, శాసనమండలి సమావేశాల్లో ప్రజల పక్షాన బలంగా నిలబడి, ప్రాజెక్టులపైన, ప్రజా సమస్యలపై రాష్ర్ట ప్రభుత్వాన్ని ప్రశ్నించి స్పష్టమైన సమాధానాలు రాబట్టాలని వారికి సూచించారు. ప్రజలకు సంబంధించిన కీలక అంశాలను సమర్థవంతంగా, ప్రభావంతంగా లేవనెత్తాలని నేతలకు సూచించారు.
అలాగే కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంతోపాటు అసమర్థ పాలనపై అసెంబ్లీలో బలమైన స్వరం వినిపించాలని తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలు, అమలు చేస్తున్న కార్యక్రమాలు, వైఫల్యాలను ప్రజల ముందు బహిర్గతం చేయాలన్నారు. అసెంబ్లీలో బీజేపీ బలమైన పాత్ర పోషించాలని తమ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు రాంచందర్‌రావు సూచించారు.