calender_icon.png 6 October, 2025 | 8:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీహార్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల

06-10-2025 05:33:57 PM

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఆసక్తిరేపుతోన్న బీహార్ శాసనసభ ఎన్నికల షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం ప్రకటించింది. ఈ మేరకు పోలింగ్ తేదీలు, ఎన్నికల కౌంటింగ్ తేదీని ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ వెల్లడించారు. రెండు విడుతల్లో పోలింగ్ నిర్వహణ జరుగుతోందని, మొదటి దశ నవంబర్ 6, రెండవ దశ నవంబర్ 11వ తేదీన పోలింగ్, నవంబర్ 14వ తేదీన బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరగనుందని ఆయన తెలిపారు.

మొత్తం 243 స్థానాలతో ఉన్న బీహార్ అసెంబ్లీ గడువు నవంబర్ 22తో ముగియనుందిబీహార్ లో ఎస్సీ రిజర్వ్డ్ సీట్లు-38, ఎస్టీ రిజర్వ్డ్ సీట్లు-2ను ప్రకటించిన ఎన్నికల కమిషన్, బీహార్ లో పురుష ఓటర్లు 3.92 కోట్లు, మహిళ ఓటర్లు 3.50 కోట్లతో కలిపి మొత్తం 7.42 కోట్ల ఓటర్లు ఉన్నట్లు వివరించారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేందుకు మొత్తం 90,712 పోలింగ్ కేంద్రాలను ఎన్నికల సంఘం కేటాయించింది. ప్రతి పోలింగ్ స్టేషన్ లో వెబ్ క్యాస్టింగ్, దివ్యాంగులు, 85 ఏళ్లు దాటిన వృద్ధులు ఇంటి నుంచే ఓటు వేసేందుకు కమిషన్ అవకాశం కల్పించింది.

బీహార్ లో 14.01 లక్షల మంది కొత్తగా ఓటు హక్కును నమోదు చేసుకున్నారని, వందేళ్లు దాటిన ఓటర్ల సంఖ్య 14 వేలు ఉన్నారని ఈసీ వెల్లడించింది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల నుంచే 17 నూతన సంస్కరణలు జరిగాయని సీఈసీ జ్ఞానేష్ తెలిపారు. గరిష్టంగా 1200 మంది ఓటర్లకు ఒక పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నామని చెప్పారు. ఈవీఎంలపై తొలిసారి అభ్యర్థులు కలర్ ఫోటోలు వినియోగించడం జరుగుతుందన్నారు. అంతేకాకుండా 250 పోలింగ్ స్టేషన్ల పరిధిలో అశ్వకదళాలతో గస్తీ ఉంది. 

ప్రస్తుతం బీహార్ లో ఏన్డీయే ప్రభుత్వం అధికారంలో ఉంది. 2020లో జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నకల్లో జేడీయూ, బీజేపీ పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. ఏన్డీయే హయంలోనే నీతీశ్ కుమార్ ప్రమాణస్వీకారం చేసి, రెండేళ్ల తర్వాత ఎన్డీయేను  వీడారు. ఆర్జేడీ, కాంగ్రెస్ తో మహాగఠ్ బంధన్ లో చేరి నీతీశ్ కుమార్ మళ్లీ ముఖ్యమంత్రి అయ్యారు. 2024 జనవరిలో మహా కూటమిని వీడిన జేడీయూ మళ్లీ ఎన్డీయేతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేశారు.