06-10-2025 10:33:22 PM
న్యూఢిల్లీ: సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్(CJI Justice BR Gavai)పై దాడికి యత్నించడాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ(PM Narendra Modi) తీవ్రంగా ఖండించారు. సీజేఐపై దాడికి యత్నం ప్రతి భారతీయుడిని ఆగ్రహానికి గురి చేసిందని ఆయన అన్నారు. మన సమాజంలో ఇలాంటి చర్యలకు చోటు లేదని.. సీజేఐ జస్టిస్ బి.ఆర్ గవాయితో తాను మాట్లాడినట్లు ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఆ సమయంలో జస్టిస్ గవాయి వ్యవహరించిన తీరుపట్ల ఆయన అభినందించారని.. రాజ్యాంగ స్ఫూర్తిని బలోపేతం చేయడంలో ఆయన నిబద్ధతగా ఉన్నారని తెలిపారు.
కాగా, సుప్రీంకోర్టు ప్రాంగణంలో సోమవారం ఉదయం భారత ప్రధాన న్యాయమూర్తి బి ఆర్ గవాయ్‌పై జరిగిన దాడి ప్రతి భారతీయుడిని ఆగ్రహానికి గురిచేసింది. సుప్రీంకోర్టులోని తన కోర్టు గదిలో 71 ఏళ్ల న్యాయవాది గవాయ్ వైపు షూ విసిరేందుకు ప్రయత్నించారు. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అతని లైసెన్స్ ను తక్షణమే రద్దు చేసింది. "సనాతన ధర్మ కా అప్మాన్ నహి సహేగా హిందూస్తాన్" (సనాతన ధర్మాన్ని అవమానించడాన్ని భారతదేశం సహించదు) అనే నినాదంతో కూడిన నోట్ ను అతని వద్ద నుండి స్వాధీనం చేసుకున్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి.