12 July, 2026 | 11:57 PM

మూడు వారాల్లో 10 బిలియన్ డాలర్లు

04-05-2024 12:05 AM

కరిగిపోతున్న విదేశీ మారక నిల్వలు

ముంబై, ఏప్రిల్ మే 3: భారత్ వద్దనున్న విదేశీ మారక నిల్వలు వేగంగా తగ్గిపోతున్నాయి. ఏప్రిల్ 26తో ముగిసిన వారంలో మరో 2.41 బిలియన్ డాలర్ల మేర తగ్గి 637.93 బిలియన్ డాలర్ల వద్ద నిలిచాయి. అంతక్రితం ఏప్రిల్ 19తో ముగిసిన వారంలో 2.83 బిలియన్ డాలర్లు, ఏప్రిల్ 12 నాటి వారంలో  ఇవి భారీగా 5.4 బిలియన్ డాలర్ల చొప్పున క్షీణించాయి. ఏప్రిల్ తొలివారంలో రికార్డు గరిష్ఠస్థాయికి చేరిన తర్వాత వరుస మూడు వారాల్లో విలువైన విదేశీ మారక నిల్వలు  10.5  బిలియన్ డాలర్ల మేర తగ్గాయి. రిజర్వ్‌బ్యాంక్ శుక్రవారం వెల్లడించిన గణాంకాల ప్రకారం ఏప్రిల్ 26తో ముగిసిన వారంలో విదేశీ కరెన్సీ ఆస్తులు 1.16 బిలియన్ డాలర్ల వరకూ తగ్గి 559.7 బిలియన్ డాలర్ల వద్ద నిలిచాయి. అమెరికా డాలరుయేతర కరెన్సీలైన యూరో, పౌండు, యెన్ తదితర విదేశీ కరెన్సీల విలువ డాలరుతో పోలిస్తే తగ్గుదల, పెరుగుదలను కరెన్సీ ఆస్తుల లెక్కింపులో పరిగణనలోకి తీసుకుంటారు. 

బంగారం నిల్వలు తగ్గాయ్

దేశం వద్దనున్న బంగారం నిల్వలు సైతం సమీక్షావారంలో 1.28 బిలియన్ డాలర్ల మేర తగ్గి 55.53 బిలియన్ డాలర్లకు చేరాయి. అంతక్రితం వారం ఇవి 1.01 బిలియన్ డాలర్లు పెరిగాయి. సమీక్షా వారంలో  స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ (ఎస్‌డీఆర్‌లు) 15 మిలియన్ డాలర్లు పెరిగి 18.05 బిలియన్ డాలర్ల వద్ద నిలిచాయి. ఐఎంఎఫ్ వద్దనున్న రిజర్వులు 8 మిలియన్ డాలర్లు  ఎగిసి 4.64 బిలియన్ డాలర్లకు చేరాయి.

రూపాయి ఎఫెక్ట్

గత మూడు వారాల్లో విదేశీ మారక నిల్వలు భారీగా తగ్గడానికి రిజర్వ్‌బ్యాంక్ డాలర్లను మార్కెట్లో విక్రయించడమే కారణమని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ నెలలో రూపాయి మారకపు విలువ 83.70 స్థాయికి పతనంకావడంతో ఇది మరింత తగ్గకుండా నిలువరించేక్రమంలో ఆర్బీఐ డాలర్లు విక్రయించినట్టు వారు తెలిపారు. ఈ విలువ తాజాగా 83.45 వద్ద ఉన్నది. కరెన్సీ మారకపు రేటులో తీవ్ర హెచ్చుతగ్గులు ఏర్పడితే కేంద్ర బ్యాంక్ ఫారిన్ ఎక్సేంజ్ (ఫారెక్స్) మార్కెట్లో అప్పుడప్పుడు జోక్యం చేసుకుంటుంది. పరిస్థితికి అనుగుణంగా ఆ మార్కెట్లో డాలరు లేదా రూపాయి సరఫరాల్ని పెంచడం, తగ్గించడం చేస్తుంది.