12 July, 2026 | 11:03 PM

14 శాతం పెరిగిన పెట్రోల్ వినియోగం

04-05-2024 12:05 AM

న్యూఢిల్లీ, మే 3: ఏప్రిల్ నెలలో దేశంలో పెట్రోల్ వినియోగం జోరందుకుంది. పెట్రోల్ వినియోగం గత ఏడాది ఏప్రిల్‌తో పోలిస్తే 13.8 శాతం పెరగ్గా, డీజిల్ వినియోగం మాత్రం 1 శాతమే వృద్ధిచెందినట్టు కేంద్ర చమురు మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాలు వెల్లడిస్తున్నాయి. విమాన ఇంధనం (ఏటీఎఫ్) అమ్మకాలు 8.4 శాతం, ఎల్‌పీజీ విక్రయాలు 12 శాతం పెరిగాయి. వాహన విక్రయాలు పెరగడం, వేసవిరావడంతో పెట్రోల్ డిమాండ్ భారీగా పెరిగినట్టు పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. దేశంలో విక్రయమవుతున్న మెజారిటీ వాహనాలు పెట్రోల్‌తో నడిచేవే. ప్రస్తుతం కొనసాగుతున్న లోక్‌సభ ఎన్నికల ప్రచారం కూడా అమ్మకాలు పెరగడానికి మరో కారణమని చెపుతున్నారు. విమాన ప్రయాణాలు జోరందుకోవడంతో ఏటీఎఫ్ విక్రయాలు పెరిగాయన్నారు.