calender_icon.png 1 August, 2025 | 12:42 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ద్విధ్రువ ప్రపంచం

18-07-2025 12:00:00 AM

అమెరికాను బలోపేతం చేసి ప్రపంచంలో నంబర్ వన్ ఆర్థిక శక్తిగా నిలిపేందుకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల కొరడా ఝుళిపిస్తున్నారు. ఆర్థిక శక్తి, సైనిక శక్తితో చైనాపై ఆధిపత్యం సాధించడం ట్రంప్ విధానంగా వుంది. ప్రచ్ఛన్న యుద్ధ కాలంలో ప్రపంచంలో ద్విధ్రువంగా దేశాలన్నీ దాదాపుగా రెండు కూటముల్లో ఏదో ఒక దానికి దగ్గరగా వుండేవి. ఇటు అమెరికా, అటు యూఎస్‌ఎస్‌ఆర్‌తో చాలా ఏళ్లు ద్విధ్రువ వ్యవస్థ కొనసాగింది.

యూఎస్ ఎస్‌ఆర్ విచ్ఛిన్నమైన తర్వాత ఏక ధ్రువంగా, సూపర్ పవర్‌గా అమెరికా రాజ్యమేలింది. ఆ రోజులూ గతించాయి. ప్రపంచ విధానం ఇప్పుడు మరోసారి ద్విధ్రువంగా మారింది. అయితే ప్రచ్ఛన్న యుద్ధ కాలానికీ ఇప్పటికీ తేడాలున్నాయి. అమెరికాకు నాటో దేశాల మద్దతు ఉంది. చైనా, రష్యా దేశాలు మరోవైపు నిలబడి వున్నాయి. చైనా, అమెరికా మధ్య ఆధిపత్య పోరు వున్నా, అవి వాణిజ్యం, సాంకేతిక రంగాల్లో పరస్పరం ఆధారపడి వున్నాయి.

ప్రచ్ఛన్న యుద్ధ కాలంలో బద్ద శత్రువులుగా వున్న రష్యా, అమెరికా మధ్య ఇప్పుడు ఎలాంటి సంబంధాలు లేవు. ప్రచ్ఛన్న యుద్ధ కాలంలో అలీనోద్యమ దేశాలు సోవియట్ యూనియన్ వైపు మొగ్గు జూపాయి. ఇప్పుడు సుంకాల యుద్ధంలో ద్విధ్రువ విధానం స్పష్టంగా కనిపిస్తున్నది. చైనా దిగుమతులను కట్టడి చేసేందుకు ‘అమెరికా ఫస్ట్’ నినాదంతో ట్రంప్ దేశీయ ఉత్పత్తులను పెంచే ఆలోచనలో ఉన్నారు.

అందుకు తన మాట వినని చైనాపై ఇబ్బడి ముబ్బడిగా సుంకాలు విధించేందుకు ట్రంప్ సిద్ధం అయ్యారు. మరో పక్క ఉక్రెయిన్‌పై సైనిక దాడులు ఆపని రష్యాపై కూడా యురోపియన్ యూనియన్ దేశాల నుంచి రష్యాపై ఆర్థిక ఆంక్షలు విధించడంతో బాటు రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకుంటున్న దేశాలపై కూడా అదనపు సుంకాల దెబ్బలకు ట్రంప్ సిద్ధమయ్యారు.

ఈ సుంకాల వాతలతో యుద్ధక్షేత్రంలో వున్న దేశాలపై అమెరికా తన పట్టు సాధించుకుంటుందేమో గాని, తన చెప్పుచేతల్లో పెట్టుకోవడం సాధ్యం కాదు. అమెరికా నాటో దేశాలు ఒకవైపు, చైనాన ఒక వైపు వున్న పరిస్థితుల్లో ప్రపంచ రాజకీయ, ఆర్థిక విధానాల్లో వచ్చే మార్పులు ఎలా వుండబోతున్నాయంటే, ఇప్పుడది ఊహలకందని విషయంగానే వుంది.

ద్విధ్రువ కేంద్రాలుగా పరిభ్రమించనున్న ప్రపంచ ఆర్థిక, రాజకీయ వ్యవస్థల్లో మనం ఎక్కడున్నాం? భారత విదేశాంగ విధానంలో మరింత స్పష్టత తెచ్చుకోవాల్సిన అవసరముందా? అనే ప్రశ్నలకు కేంద్ర ప్రభుత్వం కూడా సమాధానాలు వెదుకుతున్నట్టు కనిపిస్తున్నది.

సుంకాల ప్రకటనలతో ప్రపంచ మార్కెట్లను అతలాకుతలం చేస్తున్న అమెరికా ధోరణిని గమనించిన చైనా ఇప్పుడు భారత మార్కెట్‌పై దృష్టి పెట్టింది. భారత్ కూడా అనేక సమస్యలు వున్నప్పటికీ చైనాతో సాధారణ సంబంధాలను ఆశిస్తున్నది. షాంఘాయ్ సహకార సంస్థ (ఎస్‌సీవో) సమావేశాల సందర్భంగా భారత విదేశాంగ మంత్రి జైశంకర్ ఇటీవల బీజింగ్‌లో పర్యటించడం దీనికి సంకేతం.